రోడ్ల వెంబడి తిరుగుతున్న బాలలు

Childrens Are Properly Not Going To schools in East godavari - Sakshi

సాక్షి, రంగంపేట(తూర్పు గోదావరి) : బడిఈడు పిల్లలు ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. చిన్నారుల తల్లిదండ్రుల పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్యపుస్తకాలు, దుస్తులు, బూట్లు, సాక్సులు వంటి వాటితో పాటు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం సమకూరుస్తోంది. అయినా కొందరు పిల్లలు ఇంకా బడికి దూరంగానే మిగిలిపోతున్నారు. వారు పొద్దున్న లేచింది మొదలు గ్రామాల్లో తిరుగుతూ రోడ్ల పక్కన పాడేసిన చెత్తలో చిత్తు కాగితాలు, అట్టలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఏరుకుంటున్నారు. అలా సేకరించిన చెత్తను మూటలుగా కట్టి రిక్షాలపై వేసి తొక్కుకుంటూ, తోసుకుంటూ తీసుకువెళ్లి తమ పెద్దవాళ్లకు అప్పగిస్తుంటే వారు దాని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

మద్యం తాగి జల్సాలు చేసుకుంటున్నారు. పిల్లలు తెచ్చే సంపాదనకు అలవాటుపడ్డ తల్లిదండ్రులు వారిని ఈ చెత్త సేకరణకు ప్రోత్సహిస్తున్నారే తప్ప చదివించి ప్రయోజకుల్ని చేద్దామన్న ఆలోచన ఉండటం లేదు. వారి తల్లిదండ్రుల వ్యక్తిగత స్వార్థం, అధికారుల ఊదాసీనత వల్ల చాలా మంది బాలలు బడి బయటే గడుపుతున్నారు. ఆ బాలలకు చెప్పేవారు లేక తమ బాల్యాన్ని చెత్తకుప్పల మధ్య గడిపేస్తున్నారు. చిత్తుకాగితాలు, ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలను ఏరుకుంటూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వారి తల్లిదండ్రులు తాము మద్యం తాగుతూ  వీళ్లకు తాగడం అలవాటు చేసేస్తున్నారు. బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉన్నారంటూ ప్రభుత్వానికి లెక్కలు పంపే విద్యాశాఖ అధికారులకు రోడ్ల వెంబడి, చెత్తకుప్పల మధ్య తిరుగుతున్న బాల బాలికలు కనబడటంలేదు. 

అవగాహన కల్పించాలి
అధికారులు ఇలాంటి బాలల తల్లిందండ్రులకు అవగాహన కల్పించి, వారిని నయానోభయానో ఒప్పించి స్కూళ్లల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను వారికి వివరించాల్సి ఉంది. పాఠశాలలో చేరే ప్రతి విద్యార్థి తల్లికి ఏటా రూ.15 వేలు బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేస్తారని చెప్పి ఆ పిల్లలను పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top