సర్పంచ్‌లకు చెక్‌ఫీవర్ | check fever to all sarpanch | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లకు చెక్‌ఫీవర్

Aug 23 2013 5:50 AM | Updated on Sep 1 2017 10:03 PM

బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచ్‌లకు కొత్త చిక్కొచ్చి పడింది... చెక్ పవర్‌ను కార్యదర్శి భాగస్వామ్యంతో నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించడంతో అంతా కంగుతిన్నారు. రెండేళ్ల అనంతరం ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది.

 నర్సీపట్నం, న్యూస్‌లైన్ : బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచ్‌లకు కొత్త చిక్కొచ్చి పడింది... చెక్ పవర్‌ను కార్యదర్శి భాగస్వామ్యంతో నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించడంతో అంతా కంగుతిన్నారు. రెండేళ్ల అనంతరం ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. జిల్లాలో 920 పంచాయతీలకు 9 స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 911 పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయి పాలకవర్గాలు ఈ నెల మొదటివారంలో బాధ్యతలు చేపట్టాయి. పంచాయతీల్లో నిధుల లేమితో అభివృద్ధి పనులు చేపట్టలేని స్థితిలో ఉన్న వీటికి  మూడు రోజుల క్రితం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో కలిపి చెక్ పవర్ కట్టబెడుతూ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
 
 గతంలో లేనిది కొత్తగా..
 1996 ముందు కేవలం మేజరు పంచాయతీల్లో మాత్రమే చెక్ పవర్‌ను సంయుక్త ఖాతాతో నిర్వహించేవారు. 12, 13వ ఆర్థిక సంఘ నిధుల వినియోగంలో మాత్రం పంచాయతీ విస్తరణాధికారి, సర్పంచ్‌లకు భాగస్వామ్యంగా చెక్ పవర్ కొనసాగించేవారు. ఈ రెండు నిధుల వినియోగాన్ని మినహాయిస్తే మిగిలిన వాటన్నింటికీ సర్పంచ్‌కే చెక్‌పవర్ ఇచ్చారు. దీనికి భిన్నంగా పంచాయతీలో ఉన్న అన్ని నిధుల వినియోగానికి భాగస్వామ్య ఖాతా నిర్వహించాలంటూ కొత్తగా ప్రభుత్వం ప్రకటించింది.
 
 అభిప్రాయభేదాలు
 ఇద్దరి భాగస్వామ్యంతో చెక్ పవర్ నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. గ్రామాల్లో అత్యవసర పనులున్నా నిధులు విడుదల  కు కార్యదర్శి ముందుకొచ్చే పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్కోసారి నిబంధనలను అతిక్రమించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అయిన కార్యదర్శి నిధులు విడుదల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అప్పుడే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలొచ్చి, వాటి ప్రభావం గ్రామాభివృద్ధిపై పడుతుంది. 2002లో గ్రామ కార్యదర్శులు వచ్చినప్పట్నుంచి పంచాయతీలను ఏ అధికారి పట్టించుకోలేదు. ఇన్‌స్పెక్షన్లు, ఆడిట్లు సక్రమంగా జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిధుల వినియోగంపై అపోహలు చోటుచేసుకుంటాయి. దీనివల్ల భవిషత్తులో అనేక సమస్యలు తలెత్తుతాయ. దీని ప్రభావం గ్రామాభివద్ధిపై ఉంటుందన్న వాదన వ్యక్తమవుతోంది.
 
  సాధారణంగా పాలకవర్గాల పదవీ కాలం పూర్తయ్యాక పంచాయతీ సర్పంచ్‌తో పాటు కార్యదర్శులకు చెక్ పవర్‌ను ఇవ్వడం ఆనవాయితీ. దానికి భిన్నంగా పాలకవర్గాలున్న సమయంలోనూ ఉమ్మడి చెక్ పవర్‌ను కట్టబెట్టడాన్ని సర్పంచ్‌లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వంతో తేల్చుకునేందుకు సమైక్యంగా పోరాటం చేస్తామంటున్నారు. ఇదిలా ఉండగా ఆరోగ్య మిషన్ విడుదల చేసే నిధుల వినియోగం సర్పంచ్, ఏఎన్‌ఎంలకు బాగస్వామ్య చెక్ పవర్ ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బాధ్యత ఎవరికన్నదానిపై అయోమయం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement