నమ్మించి.. ముంచారు...

Cheaters given shock to the industrialist - Sakshi

పారిశ్రామికవేత్తను నిలువునా ముంచిన ఘరానా మోసగాళ్లు 

ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

గుణదల (రామవరప్పాడు): తెలుగు రాష్ట్రాల సీఎంలతో తమకు పరిచయాలున్నాయని మాయమాటలు చెప్పి ఓ పారిశ్రామికవేత్తను నిలువునా మోసం చేసిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగులోకొచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. టిక్కిల్‌ రోడ్డుకు చెందిన మేదరమెట్ల వైకుంఠలక్ష్మీనారాయణ కొలవెన్నులో మైక్రోకాస్ట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆయన కంపెనీ నష్టాల్లో నడుస్తోంది. సన్నిహితుల ద్వారా ఆయనకు నందిగామకు చెందిన నర్రా కృష్ణారావు, ఇంద్రాణి దంపతులతోపాటు చెరుకూరి శ్రీలత పరిచయమయ్యారు. నష్టాల్లోని కంపెనీల ను లాభాల్లోకి తెచ్చిన అనుభవం తమకు ఉందంటూ వారు ఆయనను నమ్మించారు. కృష్ణారావుకు కంపెనీలో డైరెక్టర్‌గా అవకాశం కల్పిస్తే తమకున్న పరిచయాలతో రుణాలు తెస్తామని, పెద్ద వాళ్లతో పెట్టుబడులు పెట్టిస్తామని నమ్మబలికారు.

లక్ష్మీనారాయణ తన కంపెనీలో కృష్ణారావుకు డైరెక్టర్‌ స్థానాన్ని కల్పించారు. తర్వాత కృష్ణారావు ఆ ఖర్చులు, ఈ ఖర్చులు, రుణాలు కావాలంటే మేనేజ్‌ చేయాలని సాకులు చూపుతూ డబ్బులు దండుకోవడం మొదలెట్టాడు. నెలలు గడుస్తున్నా ఎటువంటి ఫలితం లేకపోవడంతో కృష్ణారావును అనుమానించి డైరెక్టర్‌ స్థానం నుంచి తప్పించారు. అయినా కృష్ణారావు అదే తీరులో రూ.99 లక్షల వరకూ మోసం చేశాడు. తీసుకున్న డబ్బు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో కృష్ణారావు సుమారు రూ.62 లక్షలు చెల్లించాడు. మిగిలిన సొమ్ము చెల్లించాలని ఎంతగా ఒత్తిడి తెచ్చినా స్పందించకపోవడంతో లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కృష్ణారావు, ఇంద్రాణి, శ్రీలతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top