చౌక రాజకీయం | Cheap politics | Sakshi
Sakshi News home page

చౌక రాజకీయం

Jan 29 2015 1:55 AM | Updated on Sep 2 2017 8:25 PM

అధికార దందాలు చివరికి చౌకదుకాణాలకూ చేరారుు. డీలర్ షాపులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన తమ్ముళ్లు చివరికి....

సాక్షి, కడప : అధికార దందాలు చివరికి చౌకదుకాణాలకూ చేరారుు. డీలర్ షాపులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన తమ్ముళ్లు చివరికి చౌక రాజకీయూలకు పాల్పడుతూ నోటిఫికేషన్‌నే రద్దు చేయించడం వరకు వెళ్లింది. తాము డబ్బులు తీసుకున్న వారికి షాపులు దక్కవేమోనన్న అనుమానం వచ్చి అధికార దర్పంతో మొత్తం ప్రక్రియకే బ్రేక్ వేయించారు.

మరోవైపు కడప డివిజన్‌లోని కొంతమంది తహశీల్దార్లు దరఖాస్తు ఫీజు పేరుతో ఏకంగా ఒక్కొక్కరి నుంచి రూ.200 వసూలు చేయడం విమర్శలకు తెరలేపింది. బద్వేలుకు చెందిన ఇద్దరు మహిళా నేతల మధ్య డీలర్ల వ్యవహారం పరువు ప్రతిష్ట సమస్యగా మారింది. జమ్మలమడుగులో కూడా డీలర్ల నియామక వ్యవహారంలో రిజర్వేషన్‌లపై గందరగోళం నెలకొంది.
 
కడప డివిజన్‌లో 1705 దరఖాస్తులు
కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో జనవరి మొదటి వారంలో సుమారు 268 రేషన్‌షాపు డీలర్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు 1705 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 298 ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కడపలో పరీక్ష కేంద్రానికి సంబంధించిన అవసరాలతోపాటు ప్రశ్నాపత్రాల ముద్రణ, హాల్ టిక్కెట్ల జారీ, ఇతర స్టేషనరీ ఖర్చులకును ఒక్కొక్క దరఖాస్తుదారునితో ఆయా తహశీల్దార్లు దాదాపు రూ. 200 వసూలు చేశారు.

ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన దరఖాస్తుదారునితో రూ.100 చొప్పున రాబట్టారు. ప్రభుత్వం ఖర్చులకు బడ్జెట్ మంజూరు చేసే పరిస్థితి లేదు కాబట్టి స్థానికంగా దరఖాస్తు దారులతోనే వసూలు చేశారు. మళ్లీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఈ డబ్బు ఎన్ని రోజులని బ్యాంకులో ఉంచుతారు? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఎప్పుడూ లేనిది ఈసారి నిబంధనలకు వ్యతిరేకంగా ఎందుకు దరఖాస్తుదారులతో రాబట్టారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  
 
బద్వేలులో ఇరువర్గాల పట్టు..
బద్వేలు నియోజకవర్గంలో డీలర్ పోస్టుల వ్యవహారం ఇద్దరు టీడీపీ కీలక నాయకురాళ్ల మధ్య పోరుకు దారితీస్తోంది. చెరి సగం పంచుకోవాలని ఫలితాల రోజు అనుకున్నా చివరకు జిల్లాలోని ముఖ్యఅధికారి వద్దకు పంచాయతీకి దారి తీసింది. ఒక వర్గానికి ‘జిల్లా సీఎం’గా ముద్రపడిన వ్యక్తి మద్దతు ఇవ్వగా మరో వర్గానికి టీడీపీ జిల్లా స్థాయి నేత మద్దతు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో బద్వేలు నేతలతో పాటు ఇరువురూ కూర్చొని కడపలోని గెస్ట్‌హౌస్‌లో చర్చించగా కొలిక్కిరాకపోగా మరింత పీఠముడికి దారితీసింది. అనంతరం జిల్లా ముఖ్యఅధికారి వద్ద కూడా పంచాయతీ జరుగగా ఒకింత అలక వహిస్తూ బద్వేలుకు చెందిన పార్టీ ముఖ్యురాలు వెళ్లిపోయినట్లు సమాచారం.  
 
జమ్మలమడుగు డివిజన్‌లో గందరగోళం
జమ్మలమడుగు డివిజన్‌కు సంబంధించి సుమారు 160 రేషన్‌షాపు డీలర్ల పోస్టులకు ఈనెల 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో షెడ్యూల్ కులాలు, వెనుకబడిన తరగతులకు సంబంధించి రిజర్వేషన్లపై గందరగోళం నెలకొంది.

షెడ్యూల్ కులాలకు సంబంధించి జనరల్‌లా, మహిళలకా అనేది స్పష్టత లేకపోవడం, అలాగే వెనుకబడిన తరగతులకు సంబంధించి కూడా ఇదేవిధంగా ఉండడంతో పలువురు రిజర్వేషన్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా చౌకదుకాణ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా రిజర్వేషన్లతోపాటు నోటిఫికేషన్ కూడా సక్రమమైన సమయంలో విడుదల చేయలేదని,  దరఖాస్తు దారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని ఆర్డీఓ దృష్టికి తీసుకు వెళ్లారు.
 
బ్యాంకులో జమ చేశాం -ఆర్డీఓ
దరఖాస్తుదారుల నుంచి వసూలు చేసిన దాదాపు రూ. 3 లక్షల మేర సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు కడప ఆర్డీఓ లవన్న సాక్షి ప్రతినిధికి  స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహించడానికి హాల్ టిక్కెట్ల జారీకి కొంతమొత్తం అవసరమయ్యే నేపధ్యంలో దరఖాస్తుదారులతో తీసుకున్న డబ్బులను జాగ్రత్తగా భద్రపరిచామని ఆయన తెలియజేశారు. మళ్లీ దరఖాస్తు దారులకు పరీక్ష నిర్వహించే సమయంలో బ్యాంకు నుంచి డ్రా చేసి వినియోగిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement