పెళ్లైనా అందని కానుక!

Chandranna Marrige Gift Scheme Fail In Kurnool - Sakshi

ప్రహసనంగా చంద్రన్న పెళ్లి కానుక పథకం

ప్రహసనంగా చంద్రన్న పెళ్లి కానుక పథకం

పాత పథకాలు రద్దు చేసి కొత్త పేరు

లబ్ధిదారులకు సవాలక్ష ఆంక్షలు  

జిల్లాలో ఒక్కరికీ అందని ప్రోత్సాహకం  

రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన చంద్రన్న పెళ్లి కానుక పథకం ప్రహసనంగా మారింది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ నుంచి వివాహం వరకు అనేక కొర్రీలు వేసే విధంగా ఈ పథకం రూపొందించారు. చివరకు పెళ్లి జరిగి మూడు నెలలైనా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ప్రోత్సాహక నగదు ఇవ్వకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.  

కర్నూలు(హాస్పిటల్‌): దుల్హన్‌ , గిరిపుత్రిక, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, కులాంతర వివాహాలు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పెళ్లి చేసుకుంటే ఆయా శాఖల కింద ప్రోత్సాహక నగదు ఇచ్చేవారు. ఈ మేరకు 11 శాఖల్లో ఈ పెళ్లి తంతు నడిచేది. లబ్ధిదారులు అనేక పథకాల ద్వారా ఎక్కువ సార్లు ప్రోత్సాహకం అందుకుంటున్నారని అనుమానిస్తూ పెళ్లి కానుక అంతా ఒకే వేదిక(సింగిల్‌ డెస్క్‌)పై ఉండాలన్న ఉద్దేశంతో చంద్రన్న పెళ్లి కానుక తీసుకొచ్చారు. దీని బాధ్యతను 11 శాఖలను వదిలేసి డీఆర్‌డీఏ–వెలుగు శాఖకు అప్పగించారు. అందులో పనిచేసే అధికారులతో కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు గ్రామాల్లో వెయ్యి మందికి పైగా కల్యాణ మిత్రలు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. కల్యాణ మిత్రలుగా స్వయం సహాయక సంఘాల(పొదుపు మహిళలు)ను ఎంపిక చేశారు. పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.40వేలు, బీసీలకు రూ.35వేలు, ఎస్టీలకు రూ.50వేలు, మైనార్టీలకు రూ.50 వేలు, వికలాంగులకు రూ.1లక్ష, ఎస్సీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు ప్రోత్సాహక నగదుగా అందజేస్తారు. 

లబ్ధిదారులకు సవాలక్ష ఆంక్షలు  
వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఉండాలి. వదువుకు తప్పనిసరిగా తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉండాలి. ఆధార్‌కార్డు బ్యాంకుకు అనుసంధానమై ఉండాలి. వధువరులిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు అయి ఉండాలి. వీరిద్దరూ రాష్ట్ర ప్రభుత్వం చేయబడిన ప్రజాసాధికార సర్వే జాబితాలో నమోదై ఉండాలి. ఇప్పటి వరకు నమోదు కాకపోతే మీ సేవాలో, ప్రజాసాధికార వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే సమయానికి, వివాహం తేదీ, వివాహం వేదిక నిర్ణయించి ఉండాలి. వివాహం సైతం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జరపాలి. నివాస, కుల, జనన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. వికలాంగులైతే సదరం సర్టిఫికెట్‌ ఉండాలి. కార్మికులైతే ఏపీ బిల్డింగ్, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యత్వంతో పాటు  గుర్తింపుకార్డు పొంది ఉండాలి. 

కల్యాణ మిత్రలచే విచారణ
లబ్ధిదారులు వివాహానికి 15 రోజులు ముందు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆ వివరాలు తెలుపుతూ కల్యాణ మిత్రలకు సమాచారం పంపిస్తారు. వధువు/వరుడు ఇంటికి వెళ్లి కళ్యాణ మిత్రలు వివరాలు సేకరించాలి. క్షేత్రస్థాయిలో వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని కల్యాణ మిత్ర ధ్రువీకరించిన తర్వాత వారి వివరాలు వివాహ అధికారి లాగిన్‌లోకి వెళతాయి. ఏపీ నిర్బంధ వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారం వివరాలు ఉన్నాయని నిర్ధారించిన తర్వాత అధికారి ఆమోదం తెలుపుతారు.  ఆ తర్వాత వివాహం రోజున కల్యాణ మిత్రలు వెళ్లి వివరాలు సేకరించి, పెళ్లిఫోటోలు అప్‌లోడ్‌ చేయాలి. పెళ్లి రోజున వధువు బ్యాంకు ఖాతాలో 20 శాతం, పెళ్లి రిజిస్టర్‌ అయిన వెంటనే మిగిలిన 80 శాతం నగదును ఖాతాలో వేస్తారు.

ఒక్కరి ఖాతాలోనూ నగదు వేయలేదు
జిల్లాలో చంద్రన్న పెళ్లి కానుక కింద ఇప్పటి వరకు 1600  మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటికే 543 జంటలు ఒక్కటయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఒక్కరికీ కూడా ఒక్క రూపాయి నగదు వారి ఖాతాల్లో ప్రభుత్వం వేయలేదు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ  ఏ ఒక్కరికి కూడా నగదు వేయలేదని సమాచారం. దీనికితోడు కల్యాణ మిత్రల్లో చాలా మందికి ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు నిర్వహించే పరిజ్ఞానం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెబ్‌సైట్‌లో వివరాలు, ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం, లాగిన్‌ కావడం వంటి అంశాలు సరిగ్గా రాక వారు సతమతమవుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top