చంద్రన్న మాల్స్‌ స్వాహా | Sakshi
Sakshi News home page

నారా వారి కుటుంబ వ్యాపారం కోసం చంద్రన్న మాల్స్‌ స్వాహా

Published Sat, May 26 2018 3:40 AM

Chandranna Malls to the Hands of Heritage Company - Sakshi

సాక్షి, అమరావతి: భయం గానీ, పక్షపాతం గానీ,రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ప్రమాణం చేసి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు స్వప్ర యోజనాలు, స్వార్థమే పరమావధిగా భావిస్తున్నారు. పవిత్రమైన ప్రమాణానికి పాతరేస్తున్నారు. ప్రజలు ఓట్లేసి, గెలిపించి, కట్టబెట్టిన అధికారాన్ని సొంత లాభం కోసం ఎంతగానో వాడుకుంటున్నారు. తన కుటుంబ వ్యాపార సంస్థకు జనం సొమ్మును దోచిపెట్టేందుకు ప్రభుత్వ పథకాన్ని అనువుగా మార్చేసుకుంటున్నారు. ‘చంద్రన్న మాల్స్‌’ చంద్రబాబు కుటుంబ వ్యాపారానికి లబ్ధి చేకూర్చే దుకాణాలుగా మారిపోతున్నాయి.

రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కుటుంబ వ్యాపార సంస్థ ‘హెరిటేజ్‌’ దినదిన ప్రవర్థమానంగా ఎదిగిపోతోంది. గత నాలుగేళ్లలో హెరిటేజ్‌కు ఎన్నివిధాలుగా లబ్ధి జరిగిందో తెలియందేమీ కాదు. చంద్రన్న మాల్స్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మరో దోపిడీకి  తెరతీసింది. అన్ని కిరాణా, ఫ్యాన్సీ సరుకులు విక్రయించే విధంగా చౌక దుకాణాలను చంద్రన్న మాల్స్‌గా మారుస్తున్నామంటూ సీఎం చంద్రబాబు వాటి నిర్వహణ బాధ్యతలను పరోక్షంగా తన సొంత కంపెనీకి ధారాదత్తం చేస్తున్నారు.

హెరిటేజ్‌ గ్రూపు భాగస్వామిగా ఉన్న ఫ్యూచర్‌ రిటైల్‌ గ్రూపునకు కీలకమైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో చంద్రన్న మాల్స్‌కు సరుకుల సరఫరా, నిర్వహణ బాధ్యతలను కట్టబెడుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఈ మూడు జిల్లాల్లోని చౌక దుకాణాల నిర్వహణ ఫ్యూచర్‌ రిటైల్‌ అంటే హెరిటేజ్‌ చేతుల్లోకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ మూడు జిల్లాల్లో 6,806 చౌక దుకాణాల పరిధిలో 37,19,206 రేషన్‌ కార్డులున్న కుటుంబాలు ఉన్నాయి. తొలి విడతలో భాగంగా ఈ మూడు జిల్లాల్లో 96 రేషన్‌ షాపులను చంద్రన్న మాల్స్‌గా మార్చనున్నారు. ఈ మాల్స్‌లో ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే సరుకులతోపాటు అన్ని రకాల కిరాణా, ఫ్యాన్సీ సరుకులను విక్రయించన్నారు. ఈ మాల్స్‌కు సరుకులను ఫ్యూచర్‌ గ్రూప్‌ పంపిణీ చేయనుంది. 

హెరిటేజ్‌తో బంధమిది 
హెరిటేజ్‌ గ్రూపు పలు రాష్ట్రాల్లో హెరిటేజ్‌ ఫ్రెష్‌ పేరుతో రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 124 ఔట్‌లెట్లతో ఏటా రూ.583 కోట్ల వ్యాపారం చేసేది. 2016 నవంబర్‌లో ఈ రిటైల్‌ వ్యాపారం మొత్తాన్ని వ్యూహాత్మకంగా ఫ్యూచర్‌ రిటైల్‌కు హెరిటేజ్‌ సంస్థ విక్రయించింది. ఈ విక్రయం ద్వారా నగదు తీసుకోకుండా ఫ్యూచర్‌ రిటైల్‌లో భాగస్వామ్య వాటాలను మాత్రమే తీసుకుంది. ఇలా మొత్తం వ్యాపారాన్ని విలీనం చేసినందుకు గాను ఫ్యూచర్‌ రిటైల్‌లో 3.56 శాతానికి సమానమైన 1.78 కోట్ల విలువైన షేర్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌కు దక్కాయి. అప్పట్లో ఈ ఒప్పందం విలువ రూ.295 కోట్లు అని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. ఆ సమయంలో ఫ్యూచర్‌ రిటైల్‌ షేరు విలువ కేవలం రూ.154 ఉండగా, ఇప్పుడది ఏకంగా రూ.586.75కు ఎగబాకింది. దీంతో ఫ్యూచర్‌ రిటైల్‌లో హెరిటేజ్‌ ఫుడ్‌ వాటా ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.1,047.19 కోట్లకు చేరింది. తన కుటుంబానికి వాటాలున్న కంపెనీకి చౌక దుకాణాల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ధరల బాదుడు షురూ 
బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే చంద్రన్న మాల్స్‌లో 40 శాతం తక్కువ ధరలకే సరుకులు విక్రయిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వట్టిదేనని తేలిపోయింది. గతేడాది డిసెంబర్‌ 12న విజయవాడలో చంద్రన్న మాల్స్‌ను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో బాధ్యతలను తీసుకున్న రిలయన్స్‌ రిటైల్‌ ఇప్పటికే 56  చంద్రన్న మాల్స్‌ను ప్రారంభించింది. చంద్రన్న మాల్స్‌లో ఉన్న ధరలను చూసి వినియోగదారులు షాక్‌ తింటున్నారు. బయటి మార్కెటే నయమంటూ సరుకులు కొనకుండా వెనక్కి వెళ్లిపోతున్నారు. దీంతో అమ్మకాలు అనుకున్న స్థాయిలో సాగడం లేదని చంద్రన్న మాల్స్‌కు చెందిన డీలర్లు వాపోతున్నారు. రాష్ట్రంలోని 29,995 రేషన్‌ షాపులను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement