సీమలో కరువు..కోస్తాలో వర్షాలు

Chandrababu Video Conference with Collectors - Sakshi

     కార్యదర్శులు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ 

     వైకుంఠపురం ప్రాజెక్ట్‌ త్వరగా పూర్తి చేయాలని సూచన

సాక్షి, అమరావతి: రాయలసీమలో కరువు, కోస్తాలో భారీ వర్షాల పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. భారీ వర్షాలవల్ల రిజర్వాయర్లలో 965 టీఎంసీలకుగాను 550 టీఎంసీల నీరు చేరిందని, ఇంకా 415 టీఎంసీలకు అవకాశం ఉందన్నారు. జల సంరక్షణ చర్యలవల్ల 410 టీఎంసీలు అదనంగా నిల్వ చేయగలిగామన్నారు. గోదావరి నీటిని నాగార్జునసాగర్‌ కుడికాలువకు మళ్లించేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వైకుంఠపురం ప్రాజెక్ట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. సచివాలయంలో మంగళవారం కార్యదర్శులు, విభాగాధిపతులు, కలెక్టర్లతో సీఎం శాఖల వారీగా వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష జరిపారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం నుంచి వీలైనంత ఎక్కువ నీటిని రాయలసీమ జిల్లాలకు తరలించాలని సీఎం సూచించారు.

నాలుగేళ్లలో వివిధ రంగాల్లో 511 అవార్డులు సాధించామని, ప్రజల జీవన ప్రమాణాల్లో నాణ్యత పెరగాల్సి ఉందన్నారు. డిసెంబర్‌ కల్లా అన్ని గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి జనవరిలో జరిగే జన్మభూమిలో ప్రజల ముందు ఉంచాలని సూచించారు. విజన్‌ డాక్యుమెంట్లు మండల, జిల్లాల వారీగా రూపొందించాలన్నారు. 19 పథకాలకు సంబంధించి నిధుల వినియోగం పెరగాలని చంద్రబాబు సూచించారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు 6.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.

జనవరికల్లా మరో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మంజూరై ఇంకా ప్రారంభం కాని 2.44 లక్షల ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలన్నారు. చంద్రన్న బీమా పరిహారం బాధిత కుటుంబాలకు త్వరగా అందేలా చూడాలని ఆదేశించారు. పోలీస్‌ నివేదికల్లో జాప్యం వల్ల బీమా పరిహారం చెల్లింపులో ఆలస్యం జరుగుతోందన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్, డీజీపీ ఆర్‌పీ ఠాకూర్, మంత్రులు నారాయణ, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, లోకేష్, నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top