
సాక్షి, అమరావతి బ్యూరో: రానున్న ఎన్నికల్లో ఓటర్లను బెదిరించి తమకు అనుకూలంగా మలచుకునే దిశగా టీడీపీ ప్రభుత్వం మరో పన్నాగానికి సన్నద్ధమవుతోంది. టీడీపీకి ఓటేయకపోతే ఇంతవరకు అందిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని చెప్పేందుకు స్టిక్కర్ రాజకీయానికి తెరతీసింది. ఓ వైపు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ.. మరోవైపు టీడీపీ నేతల బెదిరింపులకు లైసెన్స్ ఇచ్చేలా వ్యవహరిస్తోంది. సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల ఇళ్లకు చంద్రబాబు ఫొటోతో ప్రత్యేక స్టిక్కర్లు అతికించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లు, చిరునామా, ఇతర వివరాలను కుటుంబాల వారీగా జాబితాలను రూపొందించాలని చెప్పింది.
స్థానిక టీడీపీ నేతలను వెంటబెట్టుకుని మరీ ఇంటింటికి తిరుగుతూ ఆ స్టిక్కర్లు అతికించాలని ప్రభుత్వం చెప్పడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇంటికి స్టిక్కర్ వేసే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలని, లేకపోతే సంక్షేమ పథకాలు అందకుండా చేస్తామని అధికారుల ఆధ్వర్యంలో అధికార పార్టీ నేతలు హెచ్చరికలు చేస్తారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార యంత్రాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇంతవరకు రాష్ట్రంలో ఇలాంటి విధానాన్ని ఏ ప్రభుత్వం అనుసరించలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలతో స్టిక్కర్లు అతికించడానికి సిద్ధపడితే ప్రజలు తిరగబడతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీని వల్ల గ్రామాల్లో వివాదాలు, ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులమైన తామెందుకు వివాదాస్పదం కావాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం మాత్రం లబ్ధిదారుల ఇళ్లకు స్టిక్కర్లు అతికించాలన్న పట్టుదలతో ఉంది. మరి ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీయనుందో వేచి చూడాల్సిందే.