
విభేదాలు వీడకపోతే పదవులు పీకేస్తా: బాబు
విభేదాలు వీడకపోతే పదవులు నుంచి తొలగిస్తానని టీడీపీ విజయనగరం జిల్లా నేతలకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
విజయవాడ : విభేదాలు వీడకపోతే పదవులు నుంచి తొలగిస్తానని టీడీపీ విజయనగరం జిల్లా నేతలకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న విజయనగరం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో సమావేశం నిర్వహించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు... ఎవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసునని, అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని చంద్రబాబు అన్నారు. నాయకులు గొడవలు పడుతూ పార్టీని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుల గొడవలు, వ్యవహారాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను చూపించి వాటికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించినట్లు తెలిసింది.
సాలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండగా ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను ప్రశ్నించారు. జిల్లా నేతలంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. పనితీరు నివేదిక తన వద్ద ఉందని, వచ్చే ఎన్నికల్లో పనిచేయనివారికి సీట్లు ఉండవని అన్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, నారాయణస్వామి నాయుడు, మీసాల గీత, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.