
ఏపీలో ‘రహస్య’ పాలన
తమదంతా పారదర్శకమైన పాలన అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు పైకి చెబుతున్నప్పటికీ, వాస్తవానికి రాష్ట్రంలో రహస్య పాలన సాగుతోంది.
పేరుకే పారదర్శకం.. బాబు పాలనంతా బహు గోప్యం
సాక్షి, హైదరాబాద్: తమదంతా పారదర్శకమైన పాలన అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు పైకి చెబుతున్నప్పటికీ, వాస్తవానికి రాష్ట్రంలో రహస్య పాలన సాగుతోంది. చంద్రబాబు సర్కారు రహస్యంగా జారీ చేస్తున్న ప్రభుత్వ ఉత్తర్వులే (జీవోలే) ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోల్లో అనేకం ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు. రోజువారీ జీవోలను కూడా ప్రభుత్వం రహస్యంగానే ఉంచుతోంది. చంద్రబాబు జూన్ 8వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తాజాగా బుధవారం వరకు ఈ రెండు నెలల్లో ప్రభుత్వంలోని వివిధ శాఖలు 2,328 జీవోలను (జీవో ఆర్టీ, జీవో ఎంస్‌లు కలిపి) జారీ చేశాయి. వీటిలో 111 వరకు ఏకంగా జీవోలు రహస్యంగా జారీ అయ్యాయి. వీటిని ఇప్పటికీ గోప్యంగానే ఉంచారు. వీటిలో ముఖ్యమంత్రి అధీనంలో ఉండే సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) నుంచి జారీ అయినవే 72 జీవోలు ఉన్నాయి. బుధవారం జీఏడీ జారీ చేసిన జీవోల్లోనూ రెండింటి వివరాలను రహస్యంగానే ఉంచారు.
చంద్రబాబు పాలన మొదలైనప్పటి నుంచే రహస్య జీవోల జారీ ప్రారంభమైంది. ఆయన అధికారం చేపట్టిన రెండు రోజులకు అంటే జూన్ పదో తేదీన జారీ అయిన పలు జీవోల వివరాలను కూడా ‘కాన్ఫిడెన్షియల్’ పేరుతో ప్రభుత్వం ఇప్పటికీ గోప్యంగానే ఉంచింది. జూన్ నెలలో 16 జీవోలను గోప్యంగా ఉంచారు. జూలైలో జారీ అయిన వాటిలో 69 జీవోలను రహస్యంగా ఉంచారు. ఈ నెలలో బుధవారం నాటికే 26 జీవోలను కాన్ఫిడెన్షియల్ కేటగిరీలో పెట్టారు. కాన్ఫిడెన్షియల్ పేరుతో జారీ అయిన జీవోలో ఏముంటుందో తెలియదు.
అయితే, వీటిలో కొన్నింటి స్థానంలో అవసరాన్నిబట్టి మూడు నాలుగు రోజుల తర్వాత జీవో వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ జీవోల వివరాలు వెబ్‌సైట్లలో దర్శనమిస్తున్నాయి. కొన్నింటి స్థానంలో కొత్త జీవోలు (పాత తేదీల్లోనే జారీ చేసినట్టు చెప్పుకోవడానికి) దర్శనమిస్తున్నాయి. ఇలాంటివి కీలకమైన ప్రతి శాఖలోనూ ఉన్నాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఈఆర్‌సీ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోనే ఉదాహరణగా అధికారవర్గాలు చెబుతున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దు కుదరదని ఏపీఈఆర్‌సీ చెప్పగా, అసలు ఈఆర్‌సీ ఉనికి కోల్పోయిందని, దానికి ఆ అధికారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆగస్టు ఒకటో తేదీనే ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఈఆర్‌సీ ఏర్పాటు చేశామని, పాత ఈఆర్‌సీ ఆదేశాలు చెల్లవని పేర్కొంది. అయితే ఆగస్టు ఒకటిన విద్యుత్ శాఖ జారీ చేసిన ఒక జీవోను కాన్ఫిడెన్షియల్ పేరుతో రహస్యంగా ఉంచింది.
తీరా పీపీఏల రద్దు కుదరని ఈఆర్‌సీ ప్రకటించిన తర్వాత ఆ ఆదేశాలు చెల్లవని, తామిప్పటికే కొత్త ఈఆర్‌సీని ఏర్పాటు చేసుకున్నామని, కావాలంటే చూడండంటూ ఈ నెల ఒకటిన జారీ అయిన కాన్ఫిడెన్షియల్ జీవోను 12వ తేదీన బహిర్గతం చేసింది.ఈ రకంగా ప్రభుత్వం సాగిస్తున్న రహస్య పాలనపై అధికారవర్గాలే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులపై జారీ చేసే వ్యక్తిగతమైన జీవోలనే రహస్యంగా ఉంచుతారని, ప్రజా సంబంధమైన ఉత్తర్వులు వేటినీ ఏ ప్రభుత్వమూ ఇలా గోప్యంగా ఉంచదని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక గత 2 నెలల్లో టీడీపీ సర్కారు రహస్యంగా ఉంచిన జీవోల
వివరాలు శాఖల వారీగా..
సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) 73
హోం శాఖ 9
రెవెన్యూ 8
వైద్య, ఆరోగ్య శాఖ 4
రవాణా, ఆర్ అండ్ బీ 2
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి 2
న్యాయ శాఖ 1
పరిశ్రమలు 1
విద్యా శాఖ 1
అటవీ శాఖ 1
విద్యుత్ శాఖ 1
వ్యవసాయ, దాని అనుబంధ శాఖలు 7
ఏపీ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ 1
‘సాక్షి’ని అనుమతించని బాబు
తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు ఇంతకాలం ‘సాక్షి’ని దూరం పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకూ సాక్షి ప్రతినిధిని అనుమతించవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాత్రి ఏడు గంటలకు చంద్రబాబు నివాసంలో ‘పాలనపై శ్వేతపత్రం’ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పత్రికా విలేకరులను ఆహ్వానించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి సాక్షికి కూడా ఆహ్వానం అందింది. ఆహ్వానం మేరకు చంద్రబాబు నివాసానికి వెళ్లిన సాక్షి పాత్రికేయుడిని భద్రతా సిబ్బంది లోనికి అనుమతించలేదు. తనకు ఆహ్వానం ఉందని, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు గతంలో కూడా చంద్రబాబు నివాసానికి అనుమతించిన విషయాన్ని భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు.
ఇదే విషయాన్ని అవుట్ గేట్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు తమ ఉన్నతాధికారులకు సెట్‌లో సమాచారం ఇచ్చారు. ‘సాక్షి, నమస్తే తెలంగాణ రిపోర్టర్లకు అనుమతి లేదు. వారు ఏం చెప్పినా అనుమతించవద్దు’ అని ఉన్నతాధికారుల నుంచి సెట్ లో ఆదేశాలు వచ్చాయి. ‘సెట్‌లో వచ్చిన సమాధానాన్ని మీరే విన్నారు కదా! అనుమతి లేకుంటే మేం ఏమీ చేయలేం’ అని రిపోర్టర్‌కు సిబ్బంది చెప్పారు. విలేకరుల సమావేశానికి ఆహ్వానం పంపించిన సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినప్పటికీ వారేమాత్రం స్పందించలేదు.