బస్సుల్లో సీఎంను ఎవరెవరు కలిశారు.. | Chandrababu Naidu to address 'Dalita Tejam' meet | Sakshi
Sakshi News home page

బస్సుల్లో సీఎంను ఎవరెవరు కలిశారు..

Jul 1 2018 8:38 AM | Updated on Oct 20 2018 6:23 PM

Chandrababu Naidu to address 'Dalita Tejam' meet - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : బస్సులో ఏం జరిగింది.. బస్సుల్లో సీఎంను ఎవరెవరు కలిశారు.. ఏం మాట్లాడారు.. సభా ప్రాంగణానికి వచ్చిన సీఎం బస్సు దిగకుండా బస్సులోనే 15 నిమిషాలు ఎందుకు గడిపారనేది ప్రస్తుతం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేతలు ఊహించి నట్లే సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పార్టీ పరిస్థితిపై నేతల వద్ద ఆరా తీశారు. జిల్లాలో ఏం జరుగుతుందని మొదలుపెట్టి అన్ని అంశాలపై మాట్లాడినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో కొందరు నేతల మధ్య తీవ్ర స్థాయిలో ఆధిపత్య పోరు సాగుతున్న క్రమంలో మళ్లీ సీఎం పర్యటన జరగటం అది కూడా సీఎం కొందరితో మాట్లాడటం రకరకాల చర్చకు దారి తీసింది. శనివారం సాయంత్రం 4.30 గంటలకు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో సీఎం సభాస్థలికి బయలుదేరారు. ఈ క్రమంలో సీఎంతో పాటు కడప నుంచి మంత్రి సోమిరెడ్డి వచ్చారు. 

బస్సులో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఉన్నారు. ఈ క్రమంలో బస్సులో జిల్లా అధికార పార్టీ రాజకీయాలపై చర్చ సాగింది. ప్రధానంగా జిల్లాలో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. అలాగే సీఎం పర్యటన సందర్భంగా ముస్తాబు చేసిన రోడ్డను చూసి బాగా అభివృద్ధి చేశారని కితాబు ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి జోక్యం చేసుకుని పార్టీ అభ్యర్థుల్ని ముందుగా ప్రకటిస్తే అందరు పనిచేసుకుంటారని, లేదంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. 

ఇక ఆత్మకూరు రాజకీయాలపైనా చర్చ సాగింది. పార్టీ నేతల తీరుపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ వీడకముందే ఆత్మకూరులో మంత్రి సోమిరెడ్డి కన్నబాబుతో హడావుడి చేయిస్తున్నారని, ఇది పార్టీకి కొంత ఇబ్బంది అని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే కన్నబాబు హడావుడిగా సమావేశాలు పెట్టి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నగరం మొదలుకొని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిని సీఎంకు వివరించినట్లు సమాచారం. 

మరో వైపు సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం బస్సులోనే 15 నిమిషాలు ఉన్నారు. తొలుత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సీఎంతో మాట్లాడి వేదిక పైకి వచ్చిన వెంటనే మరో మంత్రి నారాయణ బస్సులోకి వెళ్లి బాబుతో మంతనాలు నిర్వహించారు. ఈ క్రమంలో నగరంలో పార్టీ పరిస్థితిపై చర్చకు వచ్చినట్లు సమాచారం. మొత్తం మీద జిల్లా రాజకీయాల విశ్లేషణ బస్సులోనే సాగటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement