కౌంటింగ్‌పై కుట్రలు!

Chandrababu Conspiracies to create tensions on votes counting day - Sakshi

ఓట్ల లెక్కింపు రోజు ఉద్రిక్తతలు సృష్టించేందుకు చంద్రబాబు వ్యూహం

కౌంటింగ్‌ హాల్లో ప్రతి విషయంలోనూ ఘర్షణకు దిగాలంటూ టీడీపీ ఏజెంట్లకు ఆదేశం

ప్రత్యర్ధి మెజార్టీ తక్కువగా ఉంటే ప్రతి రౌండ్‌కు రీ–కౌంటింగ్‌కు ఫైట్‌ చేయండి

వీవీప్యాట్‌లు, ఈవీఎంల లెక్కలు సరిపోలకుంటే ‘ఫైట్‌’కు వెనుకాడొద్దు

రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఫలితం ప్రకటించకుండా ఒత్తిడి చేయండి

టీడీపీ ఏజెంట్లకు దిశా నిర్దేశం చేస్తూ 45 పేజీలతో ప్రత్యేకంగా ఓ పుస్తకం సిద్ధం

తమకు సహకరించేందుకు ఇతర పార్టీల ఏజెంట్ల కొనుగోళ్లు

సాక్షి, అమరావతి: ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా పూర్తయ్యేలా సహకరించాలని ఏ రాజకీయ పార్టీ అయినా తన ఏజెంట్లకు సూచిస్తుంది. అధికారం కోల్పోతున్నామనే నిస్పృహతో టీడీపీ మాత్రం కౌంటింగ్‌ సమయంలో గిల్లికజ్జాలకు సిద్ధమవుతోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి విషయంలోనూ ఘర్షణ వైఖరి అనుసరించాలంటూ టీడీపీ తన ఏజెంట్లకు నూరిపోస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.  

రౌండ్‌ రౌండ్‌కూ రీ కౌంటింగ్‌కు ఒత్తిడి! 
గత నెల 11వతేదీన పోలింగ్‌ రోజు ఈవీఎంల పనితీరుపై రభస చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఉద్రిక్తతలను సృష్టించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో టీడీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు చంద్రబాబు శిక్షణ కూడా ఇప్పించడం గమనార్హం. కౌంటింగ్‌ సమయంలో ఉద్రిక్తతలను ఎలా రెచ్చగొట్టాలో ఉపదేశిస్తూ టీడీపీ ప్రత్యేకంగా 45 పేజీలతో ఓ పుస్తకాన్ని కూడా ముద్రించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కళ్లెదుట ఓటమి కనిపిస్తే తొండాట ఆడాలంటూ, కౌంటింగ్‌ హాల్లో వీరంగం సృష్టించాలంటూ టీడీపీ తన ఏజెంట్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రత్యర్ధి మెజారిటీ తక్కువ ఉంటే ప్రతి రౌండ్‌కు రీ–కౌంటింగ్‌ కోసం ‘ఫైట్‌’ చేయాలంటూ, రిటర్నింగ్‌ అధికారిపై తీవ్రంగా ఒత్తిడి తేవాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫైట్‌ చేయడమనే పదం వినియోగించడం ద్వారా టీడీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు ఏం సంకేతాలు ఇస్తున్నారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.  

ఫలితం ప్రకటించకుండా అడ్డం పడండి.. 
వీవీ ప్యాట్‌లు, ఈవీఎంల ఓట్ల లెక్కల్లో తేడా వస్తే రీ–కౌంటింగ్‌కు డిమాండ్‌ చేయాలని టీడీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు సూచించారు. రీ కౌంటింగ్‌ పట్టుబట్టి సాధించుకునేలా మానసికంగా సిద్ధం కావాలని పేర్కొంది. ఒకసారి రిటర్నింగ్‌ అధికారి ఫలితం ప్రకటిస్తే ఏమీ చేయలేమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫలితం ప్రకటించకుండా అడ్డుపడాలని, రీ కౌంటింగ్‌ కోసం ఎంతవరకైనా పోరాడాలంటూ టీడీపీ ఏజెంట్లను ఆదేశించారు. 

పోస్టల్‌ బ్యాలెట్లపైనా.. 
పోస్టల్‌ బ్యాలెట్లలో 13–ఏ, 13–బి, 13–సి సక్రమంగా ఉంటేనే లెక్కింపునకు అంగీకరించాలని, లేదంటే తిరస్కరించేలా ఒత్తిడి తేవాలని టీడీపీ ఏజెంట్లకు సూచించారు. పోలింగ్‌ రోజే కళ్ల ముందు ఓటమి సాక్షాత్కరించడంతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఘర్షణలకు దారి తీసేలా వ్యవహరించడాన్ని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈవీఎంలు పనిచేయడం లేదంటూ ఒకసారి, ఎవరికి ఓటు వేసింది వీవీ ప్యాట్‌లో కనిపించడం లేదంటూ మరోసారి గందరగోళం సృష్టించారని ఓ సీనియర్‌ అధికారి గుర్తు చేశారు.  

ఆ ఉచ్చులో చిక్కుకోవద్దు.. 
ఓట్ల లెక్కింపు సందర్భంగా తన కౌంటింగ్‌ ఏజెంట్లకు సహకరించేందుకు స్వతంత్ర అభ్యర్ధుల ఏజెంట్లతో పాటు తన ఎన్నికల పార్టనర్‌ పార్టీ అభ్యర్ధుల ఏజెంట్లను కూడా టీడీపీ ఇప్పటికే కొనుగోలు చేసిందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. టీడీపీ వాదనలను సమర్థించేలా తర్ఫీదు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. వీవీ ప్యాట్‌ స్లిప్‌లను మాయం చేసి ఈవీఎంలకు, వీవీప్యాట్‌ లెక్కలకు పొంతన లేదంటూ వివాదాస్పదం చేసేందుకు కూడా వెనకాడరాదని టీడీపీ నిర్ణయించింది. ఇలా ఘర్షణలు రేకెత్తించేందుకు ఏ ఒక్క మార్గాన్నీ వదలకూడదనే ధోరణిలో టీడీపీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ రెచ్చగొట్టేలా వ్యవహరించినా ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధులు, ఏజెంట్లు ఆ ఉచ్చులో చిక్కుకోకుండా సంయమనంతో ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే రిటర్నింగ్‌ అధికారులకే నివేదించాలని సూచిస్తున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top