సచివాలయ ఉద్యోగాలకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ షురూ 

Certificate Verification for Secretariat jobs was started - Sakshi

ఐదు జిల్లాల్లో మొదలు..  నేటి నుంచి మిగిలిన జిల్లాల్లో కూడా

జిల్లాల వారీగా..పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలు వెబ్‌సైట్‌లో 

ఈనెల 29కల్లా మొత్తం ప్రక్రియ పూర్తి 

సాక్షి, అమరావతి : సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కార్యక్రమం మంగళవారం ఐదు జిల్లాల్లో ప్రారంభమైంది. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇందుకు శ్రీకారం చుట్టగా మిగిలిన ఎనిమిది జిల్లాల్లో బుధవారం నుంచి మొదలు పెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో పోస్టుల వారీగా ఎంపికైన వారి జాబితాలను అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబరు, జిల్లా ర్యాంకుల వివరాలతో అధికారులు ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. 19 రకాల ఉద్యోగాలకు సంబంధించి షార్ట్‌లిస్టును తయారుచేసి ప్రకటించాల్సి ఉండగా.. మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు జిల్లాల వారీగా, పోస్టుల వారీగా ఉద్యోగాలకు ఎంపికైన వారితో కూడిన 105 షార్ట్‌లిస్టులను అందుబాటులో ఉంచారు.

రిజర్వేషన్ల ప్రకారం, రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా జాబితాల రూపకల్పన సంక్లిష్టంగా మారడంతో జాబితాల వెల్లడి ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా, అన్ని జిల్లాల్లో అన్ని రకాల పోస్టులకు షార్ట్‌లిస్టు బుధవారం సాయంత్రానికి ఖరారయ్యే అవకాశముందని వారంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలంటూ అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపుతారు. మరోవైపు.. ముందుగా నిర్ణయించినట్లుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభమైన చోట కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీలు ఈ ప్రక్రియను 24 నుంచి 26 వరకు జరుపుకోవడానికి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో అవసరమైతే 27వ తేదీ వరకు కూడా జరిపినా 29వ తేదీకల్లా మొత్తం ప్రక్రియను పూర్తిచేసి ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేయాలని అధికారులు స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top