కడపలోనే కాదు, విశాఖలోనూ స్టీల్ ప్లాంట్ 

Central Government Build Steel Plants In Kadapa And Vizag Says Ram Mohan Reddy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కేవలం కడపలోనే కాదు, విశాఖలోనూ మరో స్టీల్ ప్లాంట్ ఇవ్వనుందని ఏపీ బీజేపీ నేత కందుల రాజమోహన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు కందుల రాజమోహన్ రెడ్డి, రఘునాథ్ బాబు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఉప రాష్ట్రపతి నివాసంలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. చర్చ అనంతరం కందుల రాజమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ విషయంలో టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2014 సంవత్సరంలో సెయిల్ ఇచ్చిన నివేదికలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పిన విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారని, చివరి పేరాలో ప్రస్తావించిన మెకాన్ సంస్థ ప్రాథమిక నివేదిక గురించి ఉద్దేశపూర్వకంగా వదలేశారని పేర్కొన్నారు. 

ఇతర రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఉన్నా సరే విశాఖలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు కేంద్రం సిద్దపడిందని, కడపలో స్టీల్ ప్లాంట్ శంఖుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ ఖచ్చితంగా వస్తుందన్న విషయం తెలుసుకాబట్టే టీడీపీ నేతలు స్టీల్ ప్లాంట్ కోసం దీక్షల పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే 2014లో సెయిల్ నివేదిక.. స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదన్నప్పుడే ఎందుకు ధర్నాలు, దీక్షలు చేయలేదని ప్రశ్నించారు. కడప జిల్లాలో అభివృద్ధి పనులు చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. సీఎం రమేశ్ సహా టీడీపీ నేతల దీక్షల్లో ఏమాత్రం స్వచ్ఛత, చిత్తశుద్ధి లేదని, పార్లమెంటులో 6 గంటలకే స్పృహ కోల్పోయిన నేతలు 6 రోజులుగా ఇప్పుడు ఎలా దీక్ష చేయగల్గుతున్నారని ప్రశ్నించారు. 

చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారు?
న్యూఢిల్లీ : చంద్రబాబు రాయలసీమ వ్యక్తి అని చెప్పుకుంటూ.. సీమకు ఏం చేశారో చెప్పాలని ఏపీ బీజేపీ నేత రఘనాధ బాబు డిమాండ్‌ చేశారు. మంగళవారం కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు కందుల రాజమోహన్ రెడ్డి, రఘునాథ్ బాబు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఆయన నివాసంలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. చర్చ అనంతరం రఘునాధ బాబు మాట్లాడుతూ.. టీడీపీ దొంగ దీక్షలు కొంగ జపాలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అబద్దాలు, అసత్యాలను ప్రచారం చేస్తోందన్నారు. 300మిలియన్ టన్నుల ఐరన్ ఉత్పత్తి చేయాలని కేంద్రం భావిస్తోందని, స్టీల్ ధర పెరుగుతుంది కాబట్టి తప్పకుండా స్టీల్ ప్యాక్టరీ వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. 

కేంద్ర ఉక్కుశాఖ మంత్రిని ఆరా తీసిన వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ : కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. మంగళవారం కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు కందుల రాజమోహన్ రెడ్డి, రఘునాథ్ బాబు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ఇంటికి పిలిపించిన వెంకయ్య నాయుడు స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. కడప, విశాఖలో స్టీల్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top