ప్రచారం చేస్తే..పరేషాన్‌ కావాల్సిందే..!

Central Election Commission Has Announced That The Election Code Will Be Applied To Social Media - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : ఎన్నికల కోడ్‌ కూయడంతో... ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వచ్చి చేరారు. దీంతో పాటు సోషల్‌ మీడియాకు ఎన్నికల నియమావళి వర్తింపచేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేసినా.. ఫార్వర్డ్‌ చేసినా ఇబ్బందులు తప్పవు.. సో.. ఉద్యోగులూ బహుపరాక్‌..

 కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభకు కలిపి జమిలి పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్‌ అరోరా ప్రకటించారు. దీంతో ఎన్నికల కోడ్‌ రావడంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కోడ్‌ పరిధిలోకి వచ్చినట్లయింది. ఉద్యోగులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే వారిపై వేటు వేసే అధికారం ఎన్నికల యంత్రాంగానికి ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తే వారిని ఉద్యోగం నుంచి కూడా తొలగించే అధికారం ఉంటుంది. (గతంలో మన జిల్లాలో కొందరు ఉద్యోగులు సైతం సస్పెన్షన్‌కు గురైన ఘటనలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓ అభ్యర్థికి సమీప బంధువైన విద్యావిభాగానికి చెందిన ఓ అధికారిపై కూడా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.) కాగా ఫలానా అభ్యర్థికి ఓటు వేయండి అని ప్రచారం చేసినా.. వ్యతిరేకంగా ప్రచారం చేసినా సోషల్‌ మీడియాలో ప్రచారం చేసినా చర్యలు తప్పవు.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా సెక్షన్‌ 23 (ఐ)ను అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు ప్రచారం నిర్వహించరాదని 1949 సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులో ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీని ప్రకారం సెక్షన్‌ 23(ఐ) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ పథకాలను కూడా ఈ సమయంలో ప్రచారం చేయకూడదన్న ఆంక్షలు లేకపోలేదు.

సోషల్‌ మీడియాతో బీ కేర్‌ఫుల్‌
కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియా పాత్ర ఎనలేనిది. ఎన్నికల ఫలితాలను సైతం తారుమారు చేసే స్థాయికి సోషల్‌ మీడియా ఎదగడంతో పోటీ చేసే అభ్యర్థులు, వారి అనుచరగణం సోషల్‌మీడియాను ఎక్కువగా వినియోగించుకుంటారు. ఇందుకోసం ఏకంగా సోషల్‌ మీడియా విభాగాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, మెసెంజర్‌ వంటి వాటితో ప్రచారం నిర్వహిస్తుంటారు.

ఇదే సమయంలో గ్రూపుల్లో రెచ్చగొట్టే ప్రచారాలు, మతపరమైన సున్నితాంశాలు వంటి విషయాల్లో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జరగరానిదేదైనా జరిగితే గ్రూప్‌ అడ్మిన్‌ బాధ్యుడవుతాడని కనుక సోషల్‌ మీడియా విషయంలో కూడా ఉద్యోగులు అనవసరమైన వివాదాలకు, ప్రచారాలకు పోకుండా ఉంటే మంచిదని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ వాట్సాప్‌ గ్రూపుల్లో ఎన్నికల నియమావళికి సంబంధించిన క్రమశిక్షణ చర్యల గురించి వేగంగా విస్తరిస్తున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top