టీటీడీపై కేంద్రం పెత్తనం.. అంతలోనే వెనక్కి

Central Archaeological Department Write Letter To TTD EO - Sakshi

రక్షణ పేరుతో టీటీడీలో కేంద్రం జోక్యం

ఈవోకు పురావస్తు శాఖ లేఖ

శ్రీవారి భక్తుల్లో ఆందోళన

వెల్లువెత్తిన విమర్శలతో వెనక్కి తగ్గిన పురాతత్వ శాఖ

అంతా అబద్ధమన్న బీజేపీ ఎంపీ

సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తిరుమల్లోని ఇతర ఆలయాలను పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే తిరుమలలోని పలు ఆలయాలు, వాటి చరిత్రను కేంద్ర పురవాస్తు శాఖ పరిశీలించింది. ఆలయాలు, నిర్మాణాలు పూర్వకాలంలో నిర్మాణమైనట్లుగా పురావస్తు శాఖ వెల్లడించింది. వీటితో పాటు ఇతర ఆలయాలు, భవనాల వివరాలు అందించాలని టీటీడీ ఈవోకు కేంద్ర పురవాస్తు శాఖ లేఖ రాసింది. దీంతో టీటీడీ రాష్ట్ర పురవాస్తు శాఖకు వివరాలు అందించినట్లు సమాచారం.
  
తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర పురావస్తు శాఖ వెల్లడించింది. పురాతన కట్టడాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని, భక్తులు ఇచ్చిన విలువైన కానుకలు సరిగ్గా భద్రపరచట్లేదని, పూర్వకాలంలో రాజులు ఇచ్చిన ఆభరణాలు భద్రతకు నోచుకోవట్లేదనే ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకొన్నట్లు కేంద్ర పురావస్తు శాఖ ప్రకటించింది. దీంతో తిరుమలలోని పురాతన కట్టడాలు అన్నింటిని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకొనే అవకాశం ఉంది.

అయితే టీటీడీ నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందలేదని, అందిన వెంటనే అధికారులు తిరుమలలో సందర్శించే అవకాశం ఉన్నట్లు పురావస్తు అధికార వర్గాలు వెల్లడించాయి. పరిశీలన అనంతరం పలు కట్టడాలను ఆధీనంలోకి తీసుకొనే అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవుడిపై కేంద్రం పెత్తనం ఏంటని నిలదీస్తున్నారు.

అదంతా అబద్ధం : ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందన్న ప్రచారం అబద్ధమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. ఈ విషయంపై కేంద్ర సాంస్కృతిక శాఖా అధికారులతో మాట్లాడామని, అటువంటి అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. దేవస్థానం నుంచి కేంద్రం జోక్యం కోరితే పరిశీలిస్తారని తెలిపారు. కేవలం రాజకీయ దురుద్ధేశంతో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని జీవీఎల్‌ విమర్శించారు.

అంతలోనే వెనక్కి తగ్గిన కేంద్రం :
తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తిరుమలలోని ఆలయాలను ఆధీనంలోకి తీసుకోవటంపై కేంద్రం వెనక్కి తగ్గింది. పురావస్తు శాఖ ఢిల్లీ నుండి విజయవాడ కార్యాలయానికి పంపిన లేఖను కేంద్ర పురావస్తు శాఖ వెనక్కు తీసుకోనుందని, ఈ మేరకు తమకు సమాచారం వచ్చినట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. సమాచారం లోపం కారణంగానే ఈవోకు లేఖ పంపామంటూ పురావస్తు శాఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top