ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట రైతులకు సీఎం చంద్రబాబు శిక్ష విధిస్తున్నారని సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ ధ్వజమెత్తారు.
	జంతర్ మంతర్ ధర్నాలో మేధా పాట్కర్
	
	న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట రైతులకు సీఎం చంద్రబాబు శిక్ష విధిస్తున్నారని సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ ధ్వజమెత్తారు. జీవనోపాధినిస్తున్న భూములు లాక్కుంటూ రైతులకు ఉరివేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అన్నా హజారే నిర్వహించిన ధర్నాలో మంగళవారం ఆమె మాట్లాడారు. నిర్బంధ భూసేకరణకు తెచ్చిన ఆర్డినెన్సును ఆమోదించనివ్వబోమని చెప్పారు.
	
	ఆర్డినెన్సుతో వచ్చే అనర్థాలను వివరిస్తున్న నేపథ్యంలో ఏపీలో భూసేకరణ తీరును ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలు సంధించారు. పేద రైతుల సారవంతమైన వేలాది ఎకరాల భూముల్లో రాజధాని కోసం బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాలను కోవడం అన్యాయమే కాదని, అపరాధమూ అవుతుందన్నారు. ఇలాంటి వారిని పార్లమెంటు ఏమీ చేయలేకపోయినా ప్రజా పార్లమెంటులో శిక్ష విధించాలని కోరారు.
	 
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
