మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని వామపక్ష పార్టీలు ఆరోపించాయి.
వామపక్ష నేతలు శంకర్, కాశీనాథ్
గాంధీనగర్ : మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. కార్మికులు చేపట్టిన సమ్మెను అరెస్ట్‌లతో అణచివేయలేరన్నారు. హనుమాన్‌పేటలోని దాసరి నాగభూషణరావు భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, కాశీనాథ్‌లు మాట్లాడుతూ ప్రభుత్వ విధానం సమస్య పరిష్కరించే విధంగా ఉండాలేగానీ రెచ్చగొట్టే విధంగా ఉండరాదన్నారు. నగరంలో మున్సిపల్ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు పచ్చచొక్కా కార్యకర్తలను తాత్కాలిక ఉద్యోగాలుగా తీసుకురావాలనే ఆలోచన విరమించుకోవాలని తెలిపారు. కార్మికుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవన్నారు. ఆరు రోజులుగా సమ్మె చేస్తుండడంతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయిందన్నారు. పారిశుధ్యం లోపించి ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. పదవ వేతన సంఘం ప్రకటించిన కనీసం వేతనమే కార్మికులు కోరుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు జీతాలు పెంచుకోవడం చూపిన శ్రద్ధ కార్మికులపై చూపడం లేదన్నారు.
నగర మేయర్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు యూవీ రామారాజు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పి.గౌతమ్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకుడు బి.సత్యనారాయణ. సీపీఐ నాయకులు సూర్యారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.