‘రైతు భరోసా’ లెక్కతేలుతోంది..!

Calculating YSR Rythu Bharosa Beneficiaries In Krishna - Sakshi

సర్వే నంబర్ల వారీగా రైతు ఖాతాల పరిశీలనకు శ్రీకారం

ఈ నెల 15 నుంచి పథకం అమలు

సాక్షి, మచిలీపట్నం: ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ లబ్ధిదారుల లెక్కతేలుతోంది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం(పీఎంకేఎస్‌ఎన్‌ఎస్‌) కింద జిల్లాలో 3,18,935 మంది లబ్ధిదారులుండగా, వారిలో అనర్హులు ఎంతమందో తేల్చడంతో పాటు జాబితాలో చేరని అర్హులను గుర్తించేందుకు గత నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో పీఎం కిసాన్‌ లబ్ధిదారుల జాబితాలో 40,320 మంది అనర్హులున్నట్టుగా గుర్తించారు. కాగా సెప్టెంబర్‌ వరకు వెబ్‌ ల్యాండ్‌లో జరిగిన చేర్పులు, మార్పులు, మ్యుటేషన్‌ జాబితా ప్రకారం కొత్తగా 45,550 మంది అర్హులుగా గుర్తించారు.

50 వేల మంది ఆక్వా రైతులు..
కాగా కిసాన్‌ జాబితాలో దాదాపు 50వేల మందికి పైగా ఆక్వా రైతులున్నట్టుగా భావిస్తున్నారు. జిల్లాలో కలిదిండి, కైకలూరు, మండవిల్లి, కృత్తివెన్ను, నందివాడ, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి ప్రాంతాల్లో చేపలు, రొయ్యల చెరువులు ఎక్కువగా ఉన్నాయి. ఈ భూములన్నీ ఇప్పటి వరకు వ్యవసాయ భూములుగానే రికార్డుల్లో నమోదై ఉన్నాయి. ఈ భూములకు చెందిన వ్యవసాయ భూముల జాబితా నుంచి మినహాయించాల్సి ఉంది. రైతు భరోసా నిబంధనల ప్రకారం వీరంతా అనర్హులే.

ముమ్మరంగా ప్రక్రియ..
ఇక సెంటు సాగు భూమి కూడా లేని కౌలుదారుల గుర్తింపు కూడా వేగవంతంగా జరుగుతోంది. గ్రామసభల్లోనే కాదు.. వలంటీర్ల ద్వారా కూడా ఈ గుర్తింపు చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామసభల ద్వారా 4,109 మంది కౌలు దారులను ఫార్మాట్‌ 3.2 జాబితాలో చేర్చారు. కానీ జిల్లాలో 1.31లక్షల మంది కౌలు దారులున్నట్టు అంచనా. ఎల్‌ఈసీ, సీఈసీ కార్డులు జారీ చేసిన మేరకైనా అర్హుల జాబితాలో చేర్చేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలోఎల్‌ఈసీ కార్డు దారులు 17,574 మంది, సీఓసీ కార్డుదారులు 18,762 మంది ఉండగా, ఆర్‌ఎంజీ గ్రూపుల్లో 2,784 మంది, జేఎల్‌జీ గ్రూపుల్లో 2,073 మంది ఉన్నారు. కనీసం వీరినైనా జాబితాల్లో చేర్చేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. 

త్వరితగతిన పూర్తికి చర్యలు
మరొక వైపు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వే నంబర్ల వారీగా రైత్వారీ ఖాతాలను పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో 6,21,043 ఖాతాలున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా మండల కేంద్రాల్లో ఈ ఖాతాల వారీగా పరిశీలన చేపట్టారు. ఇప్పటి వరకు 1,21,826 ఖాతాలను పరిశీలించారు. 6వ తేదీలోగా ఈ ఖాతాల పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మండల స్థాయిలో ప్రత్యేక సిబ్బందిని నియమించుకుని మరీ రేయింబవళ్లు ఖాతాల పరిశీలన చేస్తున్నారు. ఇందుకోసం మండల వ్యవసాయశాఖ కార్యాలయాల్లో ఎంపీఈఒ, ఏఈఒ, వీఆర్వో, గ్రామ కార్యదర్శులు, గ్రామ వలంటీర్లు ఖాతాల పరిశీలనలో నిమగ్నమయ్యారు. 

జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్‌..
గడువు తక్కువగా ఉండడంతో సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న తలంపుతో ఇంజినీరింగ్‌ విద్యార్థులను కూడా సహాయకులుగా నియమించుకుని వారితో కూడా పరిశీలన చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల పూర్తిస్థాయి జాబితాను తయారు చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలను తీర్చడానికి, తీర్చలేని సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేయడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెల్‌లో ఇద్దరు సహాయ వ్యవసాయ సంచాలకులు, ఇద్దరు వ్యవసాయాధికారులను నియమించారు.

అర్హులందరికీ ఇవ్వాలన్నదే లక్ష్యం
జిల్లాలో సాగుపై ఆధారపడిన రైతులు, కౌలుదారులకు రైతు భరోసా ద్వారా లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తున్నాం. నిబంధనల ప్రకారం అనర్హులను తొలగించడంతో పాటు అర్హుడైన ప్రతి రైతును ఈ జాబితాలో చేరుస్తాం. ఖాతాల వారీగా పరిశీలన చేస్తున్నాం. ఆర్‌టీజీఎస్, ప్రజా సాధికార సర్వేలతో సరిపోల్చుకుని అర్హుల జాబితాలను తయారు చేస్తున్నాం. 15వ తేదీ నుంచి రైతు భరోసా లబ్ధి అందనుంది.
– టి.మోహనరావు, జేడీ, వ్యవసాయ శాఖ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top