 
															కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అసంతృప్తి!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
	అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ విస్తరణపై సీనియర్ నేత అశోక్ గజపతి రాజను సంప్రదించకపోవడంతో పాటు,  విజయనగరం  జిల్లా మంత్రి పదవి విషయంలోనూ సూత్రప్రాయంగా కూడా ఆయన అభిప్రాయం తీసుకోనట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు వైఖరిపై అశోక్ గజపతిరాజు వర్గీయులు రగిలిపోతున్నారు. బొబ్బిలి రాజులకు మంత్రి పదవిని అశోక్ గజపతి రాజు వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారు.
	
	కాగా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారవ్వడంతో విజయనగరం జిల్లా నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రధానంగా నాడు బయటపడినవారంతా ఇప్పుడు భయపడుతున్నారు. తాము కాదన్నవారికి మంత్రిపదవి దక్కుతుందన్న సంకేతాలు రావడమే దానికి కారణం. బయటపడినవారిలో ఒక్కరికైనా స్థానం కల్పించకుంటే ఇక పార్టీలో అంతర్గత పోరు ఖాయమన్న భావన కనిపిస్తోంది. వ్యతిరేకించినవారిని అణగదొక్కే ప్రయత్నాలు మొదలవుతాయన్న వాదన వినిపిస్తోంది.
	ఈ నేపథ్యంలో జిల్లా టీడీపీ నేతలు నిన్న ముఖ్యమంత్రిని కలిశారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇవ్వొద్దని ఎమ్మెల్యేలు కొండపల్లి అప్పలనాయుడు, కోళ్ల లలితకుమారి, మీసాల గీత, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి బాహాటంగానే చెప్పారు.
	
	ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వొద్దని వారు ఈ సందర్భంగా సీఎంను కోరారు. పార్టీ కోసం కష్టపడినవారికే మంత్రి పదవులు ఇవ్వాలని, తమలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని తెలిపారు. ఓసీకిస్తే బీసీలంతా దూరమవుతారని పరోక్షంగా హెచ్చరించారు. కాగా సుజయ్‌కు మంత్రి పదవి ఇస్తున్నామన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
