
'చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారు'
రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో గవర్నర్ నరసింహన్ ప్రసంగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు.
హైదరాబాద్ : రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో గవర్నర్ నరసింహన్ ప్రసంగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్తో చంద్రబాబు నాయుడు చెప్పించినట్లుగా ఆంధ్రప్రదేశ్ దివాలా తీయలేదని ఆయన అన్నారు. రాతియుగం నుంచి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలన్నట్లుగా చూపారని రామచంద్రయ్య విమర్శించారు.
గవర్నర్ ప్రసంగం దిశానిర్దేశం లేకుండా ఉందని, రుణమాపీ వంటి హామీలపై ఎలాంటి స్పష్టత లేదని రామచంద్రయ్య అన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటే వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు. శాసన మండలిలో ఇతర పార్టీల ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. ప్రమాణ స్వీకారం చేయకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీని టీడీపీలో చేర్చుకుని ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్ద తీసిన ఘనుడు చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. మరోవైపు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు....టీడీపీలోకి వలస వెళ్లనున్నట్లు సమాచారం.