చట్టం కొందరికి చుట్టం

Buildings And Resorts in Prakasam Beache - Sakshi

సముద్ర తీరంలో వెలుస్తున్న అనధికార భవనాలు, రిసార్టులు

సీఆర్‌జడ్‌ చట్టానికి తూట్లు

సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్‌

అయినా పట్టించుకోని అధికారులు

చీరాల: చీరాల ప్రాంతంలో సముద్ర తీరం అక్రమార్కులకు అడ్డాగా మారింది. రాజకీయ బలం ఉన్నవారికి ఒక మాదిరిగా తీరాన్నే నమ్ముకుని తరాలుగా జీవిస్తున్న మత్య్సకారులకు మరో మాదిరిగా చట్టాలు మారుతున్నాయి. నచ్చని వారిని గుడిసెలు తొలగించాలంటే అప్పటికప్పుడే అధికారులు చట్టాన్న వల్లెవేస్తారు. అదే రాజకీయ పలుకుబడి ఉన్న వారైతే రిసార్టులు కట్టి విలాసం, విహారం పేరుతో వ్యాపారాలు చేస్తున్నా అడిగే దిక్కే లేదు. ఇందుకు వేదికగా మారింది సీఆర్‌జడ్‌ నిబంధన. కోస్టల్‌ రెగ్యుల్‌ జోన్‌ (సీఆర్‌జడ్‌) చట్టం మత్స్యకారులకు మాత్రం చట్టంగా, రాజకీయ పార్టీల అండదండలు ఉన్న వారికి చుట్టంలా మారింది. సముద్ర తీర ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఎలాంటి బహుళ అంతస్తుల భవనాలు, శాశ్వత కట్టడాలు, రిసార్టులు, శ్లాబ్‌ వేసి ఉన్న కట్టడాలు నిర్మించవద్దని సుప్రిం కోర్టు ఆదేశించినా కాని చీరాల నియోజకవర్గంలో మాత్రం సీఆర్‌జడ్‌ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు.

మత్య్సకారులంటే అధికారులకు అలుసు..
‘తీరం మా హక్కు.. సముద్రం మా జీవనాధారం’ అనే మత్య్సకారుల నినాదాలను పక్కన బెట్టి తీరంలో టీడీపీ నేతల అండతో కొందరు శాశ్వత భవనాలు నిర్మించారు. అయినా అధికారులు వారిని పట్టించుకోవడం లేదు. తీరం ఒడ్డున నివశించే మత్య్సకారుల పూరి గుడిసెలను తొలగించే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు, బహుళ అంతస్తులు నిర్మించుకుని వ్యాపారాలు చేస్తున్న వారి జోళికి మాత్రం వెళ్లడం లేదు. 2004లో సునామీ ఉపద్రవం సంభవించి సముద్ర తీర ప్రాంతాల్లో నివశించే మత్య్సకారులు, ఇతర ప్రజలు అశువులు బాసారు. దీంతో ప్రభుత్వం గతంలో కోస్టల్‌ రెగ్యులర్‌ జోన్‌ (సీఆర్‌జడ్‌) చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం సముద్ర తీర ప్రాంతాలకు 500 మీటర్ల సమీపంలో ఎలాంటి శాశ్వత కట్టడాలు, భవనాలు నిర్మాణం చేయ కూడదని స్పష్టంగా ఆదేశించింది. ప్రకృతి విపత్తులు, భారీ వర్షాల సమయంలో సముద్రం ఉప్పొంగి నీరు భయటకు వస్తుందని అందుకు ఎలాంటి నష్టాలు జరగకుండా ఉండేందుకు ఈ చట్టం తీసుకువచ్చింది.

అకాల వర్షాలు, తుపాన్లు, సునామీ, అల్ప పీడనాలు వంటి పకృతి వైపరీత్యాల కారణంగా సముద్రం ఉగ్రరూపం దాల్చి అల్లకల్లోలంగా మారుతుంది. కానీ చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లోని తీర ప్రాంతాల్లో మాత్రం సీఆర్‌జడ్‌ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు అధికారులు. రాజకీయ పార్టీల నేతల అడుగులకు మడుగులు ఒత్తుతు చట్టాలను అమలు చేయడం లేదు. చీరాల నియోజకవర్గంలోని వాడరేవు, విజయలక్ష్మీపురం, పచ్చమొగిలి, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, కఠారిపాలెం, సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి. ఈ తీరప్రాంతంలో రిసార్టుల పేరుతో గదులు నిర్మించి వ్యాపారాలు చేస్తున్న వారిని వదిలేస్తున్న అధికారులు పూరి గుడిసెలు వేసుకున్న గంగపుత్రులపై మాత్రం విరుచుకుపడుతున్నారు. జిల్లాలోని చీరాల వాడరేవు నుంచి సింగరాయకొండ మండలంలో కరేడు వరకు 102 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉండగా 74 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ తీర ప్రాంతాలన్నింటిలో సీఆర్‌జడ్‌ చట్టానికి తూట్లు పొడుస్తూనే ఉన్నారు. అధికారుల అండదండలతో టీడీపీ నాయకులే రిసార్టులు, హేచరిలు నిర్మిస్తూనే ఉన్నారు.

అనుమతులున్నాయో లేవో విచారిస్తా...
సీఆర్‌జడ్‌ చట్టాన్ని అనుసరించి సముద్ర తీర ప్రాంతాల్లో 500 మీటర్లలోపు భవనాలు, రిసార్టులు నిర్మాణాలు చేయకూడదు. వేటపాలెం మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయో.. లేదో తెలుసుకుంటా. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు.– మహ్మద్‌ గౌస్‌బుడే, వేటపాలెం తహశీల్దార్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top