రాజధాని ముసుగులో అంతులేని అక్రమాలు | Buggana Rajendranath Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

రాజధాని ముసుగులో అంతులేని అక్రమాలు

Dec 18 2019 3:39 AM | Updated on Dec 18 2019 8:22 AM

Buggana Rajendranath Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అంతులేనన్ని అక్రమాలు, లెక్కలేనన్ని మోసాలకు పాల్పడటమే కాకుండా చట్టాలను చట్టబండలుగా మార్చేసి రాజధానిని కుంభకోణాలమయం చేశారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ధ్వజమెత్తారు. రాజధానిని ఎక్కడ ఎంపిక చేశారో ముందుగానే తమ వారికి ఉప్పందించి కారుచౌకగా భూములు కొనుగోలు చేసి అధికార రహస్యాల పరిరక్షణ చట్టాన్ని చంద్రబాబు ఉల్లంఘించారన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, పేదలకు కేటాయించిన భూముల రక్షణ కోసం తెచ్చిన పీవోటీ (బదిలీ చేయడానికి వీలులేని) చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించారని తెలిపారు. రాజధానిపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా బుగ్గన ఆధార సహితంగా గత పాలకుల మోసాలను బట్టబయలు చేశారు.

రాజధాని అంశంపై కేంద్రం నిపుణులతో శివరామకృష్ణన్‌ కమిటీని నియమిస్తే కనీసం నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని మండిపడ్డారు. క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా శివరామకృష్ణన్‌ స్వయంగా తిరిగి  సవివరమైన నివేదిక గత ప్రభుత్వానికి అందజేశారని చెప్పారు. గుంటూరు, నూజివీడు ఇలా పలు ప్రాంతాల పేర్లు ప్రచారంలోకి తెచ్చి చంద్రబాబు, ఆయన సన్నిహితులు అమరావతి ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా కారుచౌకగా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. ‘2014 జూన్‌ 1 నుంచి డిసెంబరు వరకు కేవలం ఆర్నెళ్ల వ్యవధిలో 4,070 ఎకరాలను చంద్రబాబు, ఆయన సన్నిహితులు కొనుగోలు చేశారు. ఇది ఇప్పటి వరకూ బయటపడిన లెక్కలు మాత్రమే ఇంకా ఎన్ని ఎకరాలు బయటపడతాయో? స్పీకర్‌ అనుమతిస్తే ఎవరెవరు ఎంతెంత భూమి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రాజధాని ప్రాంతంలో  కొన్నారో ప్రజెంటేషన్‌ ఇస్తా’ అని బుగ్గన తెలిపారు. సభాపతి అనుమతించడంతో పేర్లతో సహా వెల్లడించారు. ఆ వివరాలు మంత్రి మాటల్లోనే...

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాక మరేంటి?
‘చంద్రబాబు మనుషులు లింగాయపాలెం, ఉద్దండరాయపాలెం లాంటి మారుమూల గ్రామాల్లో భూములు కొనడానికి కారణం అక్కడ రాజధాని వస్తుందని ఉప్పందడం వల్లే. లేదంటే మారుమూల పల్లెల్లో భూములు ఎందుకు కొంటారు? దీన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనక మరేమని అంటారు? కోర్‌ క్యాపిటల్‌కు 1,681 ఎకరాల మన భూమిని ఇచ్చి, అభివృద్ధికి మన నిధులిచ్చి ప్లాట్లు వేసుకోవడం కోసం కన్సార్టియంకు ఇస్తామా? వచ్చే ఆదాయంలో వాళ్లకు 52 శాతం, ప్రభుత్వానికి 48 శాతమా? రాజధానిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలా మార్చి కామధేనువులా మార్చుకుని నిరంతరం పిండుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నారు.

ఈ మోసం ఇంతటితో ఆగలేదు
జగ్గయ్యపేటలో ఎకరా రూ. లక్ష చొప్పున 498 ఎకరాలను వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు కేటాయించిన తర్వాత దాని ధర పెంచడం కోసం ఆ ప్రాంతాన్ని సీఆర్‌డీఏ పరిధిలోకి తెచ్చారు. దీనివల్ల బాగుపడింది వీబీసీ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ యజమాని ఎంఎస్‌బీ రామారావు. ఆయన చంద్రబాబు వియ్యంకుడైన బాలకృష్ణకు వియ్యంకుడు. ఇలా చేస్తే కోటీశ్వరులు ఎందుకు కారు?’

ఆయన లోకేష్‌ బినామీ
ఎస్సీ, ఎస్టీల నుంచి అసైన్డ్‌ భూములు కొన్న వారిపై చర్యలు తీసుకోవాలి. కొల్లి శివరాం 47.39 ఎకరాలు కొన్నారు. ఆయన నారా లోకేశ్‌కు  అసోసియేట్‌ అని బయట ఎవరిని అడిగినా చెబుతారు. గుమ్మడి సురేష్‌  42.92 ఎకరాలు, బరసు శ్రీనివాసరావు (నారా లోకేష్‌  మనుషులు) 14.07 ఎకరాలు  ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూమి కొన్నారు. (ఇంకా ఎవరెవరు కొన్నారో మంత్రి బుగ్గన పేర్లతో సహా వివరించారు)

తమవారికి అప్పనంగా భూములు
భూకేటాయింపుల్లోనూ గత ప్రభుత్వం అన్యాయమే చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్బీఐ, సిండికేట్‌ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు తదితరాలకు ఎకరం రూ. 4 కోట్లు చొప్పున కేటాయించారు.  కాగ్‌కు రూ .4కోట్లుకి గత పాలకులు తమకు కావాల్సిన వారికి మాత్రం ఎకరం రూ. 40 లక్షలకు, రూ. 20 లక్షలకు అప్పనంగా ఇచ్చేశారు.

ప్రైవేట్‌ సంస్థలతో ఎంవోయూ
ప్రతిపక్ష నాయకుడు ఇది గవర్నమెంట్‌ టు గవర్నమెంట్‌ అని చెప్పారు.
కానీ ఎంవోయూ ప్రైవేట్‌ సంస్థలైన సింగపూర్‌ కన్సార్టియంతో ఉంది. సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందం కాలేదు.  

బాబు బినామీల భూముల చిట్టా ఇదిగో
►బాబు సొంత సంస్థ  హెరిటేజ్‌ 14.22 ఎకరాలు కొనుగోలు చేసింది. మొత్తం 14.22 ఎకరాలు డైరెక్ట్‌గా హెరిటేజ్‌ఫుడ్స్‌ పేరు మీదే ఉన్నాయి.
►ఆవుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, ప్రమీల అనే బినామీల పేరు మీద అప్పటి మంత్రి  నారాయణ కొనుగోలు చేశారు. బంధువులు,  తన దగ్గర  పనిచేసే ఉద్యోగుల పేరుతో నారాయణ  55.27 ఎకరాల భూమి కొన్నారు.
►ప్రత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలు బినామీ పేర్లతో కొన్నారు.
►పరిటాల సునీత కూతురు భర్త పేరు మీద భూమి కొనుగోలు చేశారు.
►రావెల కిషోర్‌ బాబు 40.85 ఎకరాలు మైత్రీ ఇన్‌ఫ్రా సంస్థ ద్వారా కొనుగోలు చేశారు.
►కొమ్మాలపాటి  శ్రీధర్‌  68.60 ఎకరాలను అభినందన హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట కొన్నారు.
►అప్పటి ఎమ్మెల్యే జీవీఎస్‌ ఆంజనేయులు 37.84 ఎకరాలు  బినామీ పేరుతో కొన్నారు.
►పయ్యావుల కేశవ్‌ 15.30 ఎకరాలు పయ్యావుల శ్రీనివాసులు అండ్‌ వేం నరేందర్‌ రెడ్డి  పేరుతో కొన్నారు.
►వేమూరు రవికుమార్‌ ప్రసాద్‌ 25.68 ఎకరాలు కొన్నారు. ఆయన నారా లోకేష్‌ వ్యాపార భాగస్వామి అని అందరికీ తెలుసు.  
►లింగమనేని రమేష్‌ 351 ఎకరాలను సుజనా, ప్రశాంత్‌ పేరు మీద, ఇతర కంపెనీలు మీద కొనుగోలుచేశారు.  
►యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌ యాదవ్‌ 7 ఎకరాలు కొనుగోలు చేశారు.
►కోడెల శివప్రసాద్‌ 17.13 ఎకరాలు శశి ఇన్‌ఫ్రా  పేరు మీద కొన్నారు.
►ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి 13.50 ఎకరాలను ధూళిపాళ్ల వైష్ణవి, దేవురపుల్లయ్య పేర్లతో కొనుగోలు చేశారు.
►వీరంతా మారుమూల పల్లెల్లో ఎందుకు కొన్నారు? టీడీపీ నాయకులు, వారి బంధువులు అక్కడ రాజధాని వస్తుందని తెలిసే 2014 జూన్‌ 1 నుంచి డిసెంబరు వరకు 4,070 ఎకరాలు కారుచౌకగా కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement