ఇతరుల కుటుంబాల్లో వెలుగు నింపాలని..

Brain Dead Person Organs Donated In GGH - Sakshi

బ్రెయిన్‌డెడ్‌ అయిన కుమారుడి

అవయవాలుదానం చేసిన తల్లిదండ్రులు  

గుంటూరు ఈస్ట్‌:  తాను మరణించినా ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు ఓ యువకుడు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేసి ఆ తల్లిదండ్రులు ఐదు కుటుంబాల్లో వెలుగులు నింపారు. శావల్యాపురం మండలం పోట్లూరుకు చెందిన నారాయణరెడ్డి, భద్రమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. చిన్న కుమారుడు గోపవరపు హనుమంతరావు (37) విఘ్నేశ్వర డెయిరీలో పనిచేస్తున్నాడు. మార్చి 26న అతడు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రులు  29న జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అయితే తమ కుమారుడు దక్కడని వైద్యులు స్పష్టం చేయడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.  తమ కుమారుడి అవయవాలను దానం చేయడం ద్వారా ఇతర కుటుంబాల్లోనైనా వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని వైద్యులు తెలిపి తమ కుమారుడి అవయవాలను ఆదివారం దానం చేశారు. కన్న బిడ్డ దూరమైనా.. మరో ఐదుగురిలో జీవించి ఉన్నాడనే సంతృప్తి తమకు చాలని ఆ తల్లిదండ్రులు తెలిపారు.

గుండె మార్పిడి ఆపరేషన్‌ విజయవంతం
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మరో గుండె మార్పిడి ఆపరేషన్‌ విజయవంతంగా జరిగింది. రెండేళ్లుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న విజయవాడ కృష్ణలంకకు చెందిన గుంటూరు సురేష్‌ (24)కు జీజీహెచ్‌లో ఆదివారం గుండె మార్పిడి ఆపరేషన్‌ చేసి పునర్జన్మను ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే విలేకరులకు వివరాలు వెల్లడించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న గుంటూరు సురేష్‌ (24)కు గుండె మార్పిడి ఆపరేషన్‌ మినహా మరో మార్గం లేదని గుర్తించామని చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో బ్రెయిన్‌ డెడ్‌ కేసు ఉందని డాక్టర్‌ రాజునాయుడు చెప్పడంతో  డాక్టర్‌ సుధాకర్‌ నేతృత్వంలో తమ బృందం అత్యవసరంగా చికిత్స చేసి గుండె మార్పిడి ఆపరేషన్‌ చేసినట్లు తెలిపారు. జీవన్‌దాన్‌ ట్రస్టు ద్వారా గుండెను సేకరించినట్లు చెప్పారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా మొట్ట మొదటిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్‌ ఇక్కడ జరగడం ఆనందంగా ఉందన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులు మాత్రమే అవయవాలు సేకరించే తరుణంలో గుంటూరు జీజీహెచ్‌లోనే అవయవాలు సేకరించి ఇక్కడే అమర్చడం మరో అరుదైన సంఘటన అని చెప్పారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడు మాట్లాడుతూ జీజీహెచ్‌కి ఇదొక మైలురాయి అన్నారు. అనంతరం డాక్టర్‌ గోఖలే, డాక్టర్‌ సుధాకర్‌ను సన్మానించారు. వైద్యులు మోతీలాల్, భరద్వాజ్, శరశ్చంద్ర, సహృదయ ట్రస్టు సభ్యులు, డాక్టర్‌ గోఖలే బృందం పాల్గొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top