ప్రియుడే హంతకుడు? | Sakshi
Sakshi News home page

ప్రియుడే హంతకుడు?

Published Tue, Apr 19 2016 4:55 AM

Boyfriend Hari Krishna killed lover lakshmi devi

లాడ్జీలో రాసిన అడ్రస్ ఆధారంగా దొరికిన నిందితుడు
అనంతపురం: ‘అనంత’లో ఆదివారం దారుణహత్యకు గురైన లక్ష్మిదేవి (23) కేసులో ఆమె ప్రియుడు హరికృష్ణ హంతకుడని తేలింది. పోలీసుల విచారణలో నిందితుడు ఇదే విషయాన్ని  ఒప్పుకున్నట్లు తెలిసింది. విశ్వనీయ సమాచారం మేరకు...శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన గోవిందప్ప, నాగమ్మ దంపతుల కుమార్తె లక్ష్మిదేవిని ఏడు నెలల కిందట బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన బసవరాజుకు ఇచ్చి వివాహం చేశారు. ఉపాధి నిమిత్తం బసవరాజు దంపతులు అనంతపురం వచ్చి జాకీర్‌కొట్టాలులో నివాసం ఉంటున్నారు. అయితే లక్ష్మిదేవి పెళ్లికాక మునుపే శెట్టూరుకు చెందిన లారీ క్లీనర్ హరికృష్ణను ప్రేమించింది. ఇద్దరూ కొంతకాలం కలిసి తిరిగారు.

ఈ క్రమంలో హరికృష పలుమార్లు ఆమె తల్లిదండ్రులకు వద్దకు వచ్చి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. అయితే వారు అందుకు నిరాకరించారు. దీంతో లక్ష్మిదేవి.. హరికృష్ణకు దూరంగా ఉంటూ వచ్చింది. అప్పటినుంచి హరికృష్ణ దీన్ని మనుసులో పెట్టుకున్నాడు.  కాగా...బసవరాజును కూడా లక్ష్మిదేవి ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. పెళ్లి చేసుకుందనే  సమాచారం తెలుసుకున్న హరికృష్ణ ఎలాగైనా లక్ష్మిదేవిని మట్టుబెట్టాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమెతో సన్నిహితంగా ఉంటూ  వచ్చాడు.

మాయమాటలు చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఈ నెల 16న ఉదయం లక్ష్మిదేవికి ఫోన్‌చేసి బయటకు రావాలని కోరినట్లు సమాచారం. అతని మాటలు నమ్మిన లక్ష్మిదేవి గుడికి వెళ్తున్నానంటూ చెప్పి వచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండు సమీపంలో ప్రశాంతి లాడ్జిలో గది తీసుకున్నారు. ఆరోజంతా ఇద్దరూ గడిపారు. తనను కాదని వేరే వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావని నిలదీసినట్లు తెలిసింది. మాటామాటా పెరిగి ఆవేశానికి గురైన హరికృష్ణ తనకు దక్కని ప్రియురాలిని ఎవరికీ దక్కకూడదనే కోపంతో బాత్రూంలో గోడకు తలను  బలంగా కొట్టినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా గొంతుకూడా నులిమినట్లు తెలుస్తోంది.

లక్ష్మిదేవి మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాత గదికి బయట వైపు తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ  కేసులో త్రీటౌన్ పోలీసులు కూపీలాగడంతో అసలు విషయం వెలుగుచూసింది. లాడ్జిలో గది తీసుకునేటపుడు నమోదు చేసిన చిరునామా ఆధారంగా హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం ఒప్పుకున్నట్లు తెలిసింది. నేడు మీడియా ముందు హాజరుపెట్టే అవకాశం ఉంది.

Advertisement
Advertisement