విజయనగరం పట్టణంలోని ఎత్తుబ్రిడ్జి సమీపంలో ఉన్న బొమ్మరిల్లు సంస్థ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
నొల్లుకుంది రూ.10 కోట్లు !
Jan 22 2014 3:46 AM | Updated on Sep 2 2017 2:51 AM
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: విజయనగరం పట్టణంలోని ఎత్తుబ్రిడ్జి సమీపంలో ఉన్న బొమ్మరిల్లు సంస్థ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఒకటో పట్టణ పోలీసులు సంస్థ కార్యాలయంలో ఈ తనిఖీలు చేశారు. విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనువాస్, సీఐ కె.రామారావు ఆధ్వర్యంలో ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎస్.ధనుంజయ్‌రావు ఆధ్వర్యంలో పీఎస్‌ఐలు కాంతారావు, ఫకృద్దీన్, ఏఎస్‌ఐ అప్పలనాయుడు ఇతర సిబ్బంది సంస్థ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. కంప్యూటర్లు, ఇతర సామగ్రి, ఓచర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఓచర్లు, కంప్యూటర్‌లో ఉన్న డిపాజిట్‌దారుల చెల్లింపులు, తదితర వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. సోమవారం రాత్రి ఎస్.కోటకు చెందిన ఇద్దరు బాధితులు ఒకటో పట్టణ స్టేషన్‌లో బొమ్మరిల్లు సంస్థపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
డిపాజిట్ సొమ్ము రూ.10 కోట్లపైనే ?
జిల్లాలో బొమ్మరిల్లు బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నా రు. వీరు డిపాజిట్ చేసిన సొమ్ము రూ.10 కోట్లపైనే ఉంటుందని అంచనా. జిల్లాలోని అన్నీ ప్రాంతాల్లో బొమ్మరిల్లు డిపాజిట్ దారులు ఉన్నారు. వందకు 12 శాతం వడ్డీ ఎర వేయడం, నాలుగేళ్లకు డిపాజిట్ చేసిన సొమ్ము రెండింతలు ఇస్తామని ఆశ పెట్టడంతో చాలా మంది పెద్ద మొత్తంలో ఈ సంస్థలో డిపాజిట్ చేశారు. బొమ్మరిల్లు సంస్థలో ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేసిన వారే తర్వాత ఏజెంట్లుగా అవతారమెత్తారు. వారి పరిచయాలను ప్రజలు కాదనలేక లక్షల్లో డిపాజిట్లు చేశారు. ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు డిపాజిట్లు చేశారు. రైల్వేలో పనిచేసే ఒక ఉద్యోగి రూ.20లక్షలు, ఆ సంస్థ కార్యాలయానికి భవనం అద్దెకు ఇచ్చిన యజమాని కూడా రూ.14 లక్షల వరకు డిపాజిట్లు చేసినట్లు తెలుస్తోంది
నట్టేట మునిగిన డిపాజిట్‌దారులు..
బొమ్మరిల్లు సంస్థ బొర్డు తిప్పేయడంతో డిపాజిట్‌దారులు నట్టేట మునిగారు. కాయకష్టం మీద సంపాదించిన సొమ్ము... తమ పిల్లలకు అత్యవసర కాలంలో అవసరమవుతుందని భావించి డిపాజిట్లు చేశారు. రూ.ఐదు లక్షల లోపు డిపాజిట్ చేసిన వారిలో ఎక్కువ మంది పేదలే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు రోజుకు, నెలకు ఇలా చిన్నచిన్న మొత్తాల్లో డిపాజిట్ చేసిన వారు ఉన్నారు.
తొమ్మిది మందిపై కేసు నమోదు..
బొమ్మరిల్లు సంస్థ డెరైక్టర్, మరో ఎనిమిది మంది ప్రతినిధులపై కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎస్.ధనుంజయ్‌రావు తెలిపారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన తర్వాత ఎంతమంది డిపాజిట్‌దారులు ఉన్నారనేది తెలుస్తుందని పేర్కొన్నారు.
బోర్డు తిప్పేయడానికి సిద్ధంగా మరో సంస్థ....?
మరో ఫైనాన్స్ సంస్థ కూడా బోర్డు తిప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు సంస్థ కంటే ముం దుగా నెలకొల్పిన ఆ సంస్థ డిపాజిట్లదారులకు ఖరీదైన ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, నాలుగున్నర ఏళ్లకే డిపాజిట్లు చేసిన సొమ్ముకు రెంటింపు సొమ్ము అందిస్తామని చెప్పి ప్రచారం చేసింది.
డిపాజిట్ల కాలపరిమితి పూర్తయి ఆరునెలల కాలం దాటిన ఆ సంస్థ ఇంకా డిపాజిట్‌దారులకు డబ్బులు ఇవ్వడం లేదని తెలిసింది. బొమ్మరిల్లు సంస్థలాగా ఈ సంస్థ కూడా బోర్డు తిప్పేస్తుందేమోనన్న భయాందోళనలో ఆ సంస్థ డిపాజిట్‌దారులు ఉన్నారు.
Advertisement
Advertisement