స్వచ్ఛమైన పాలన అందిస్తున్న నరేంద్రమోడీ పథకాలను కార్యకర్తలు సమర్థవంతంగా జనంలోనికి తీసుకుపోయి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు పిలుపునిచ్చారు.
అనంతపురం కల్చరల్ : స్వచ్ఛమైన పాలన అందిస్తున్న నరేంద్రమోడీ పథకాలను కార్యకర్తలు సమర్థవంతంగా జనంలోనికి తీసుకుపోయి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని సాయి రెసిడెన్షియల్ హాల్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాళ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు.
సభ్యత్వ నమోదులో బీజేపీ అన్ని పార్టీలకన్నా ముందుందని కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలబడడం ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ స్పూర్తితోనే పార్టీ బలోపేతం కావడానికి కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలన్నారు. పోలవరం ప్రాజెక్టుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. కరువు ప్రాంతంగా పేరొందిన జిల్లా సస్యశ్యామలం కావాలంటే అన్ని ప్రాజెక్టులు త్వరగా పూర్తికావాలని, అందుకు పరస్పర సహకారం అవసరమన్నారు. అలాగే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపడానికి కేంద్రం అన్ని చర్యలు తీసకుంటుందని, ముఖ్యంగా పరిశ్రమల విషయంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. విద్యుత్ నిలువ గల రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. హరిబాబు కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు అండగా నిలవడానికి అన్ని చర్యలు తీసకుంటామన్నారు.