ఫలించిన భగీరధ యత్నం
కృష్ణానదిపై భవానీపురం - ఉల్లిపాలెం మధ్య వంతెన నిర్మాణం కల ఎట్టకేలకూ సాకారమైంది. తొమ్మిది సంవత్సరాలుగా ఈ వంతెన నిర్మాణం కోసం చేసిన ప్రయత్నాలకు కార్యరూపం వచ్చింది.
- పేర్ని నాని విశేష కృషి
- భవానీపురం - ఉల్లిపాలెం బ్రిడ్జికి రూ. 63 కోట్లు మంజూరు
- తగ్గనున్న 30 కిలోమీటర్ల దూరం
- ఎన్‌సీఆర్‌ఎంపీ ద్వారా నిధులు విడుదల
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : కృష్ణానదిపై భవానీపురం - ఉల్లిపాలెం మధ్య వంతెన నిర్మాణం కల ఎట్టకేలకూ సాకారమైంది. తొమ్మిది సంవత్సరాలుగా ఈ వంతెన నిర్మాణం కోసం చేసిన ప్రయత్నాలకు కార్యరూపం వచ్చింది. 2006లో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) బందరు మండల పరిధిలోని భవానీపురం - కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామాల మధ్య వంతెన నిర్మించాలనే ప్రతిపాదన చేశారు. జాతీయ విపత్తుల, పునరావాస పథకం (ఎన్‌సీఆర్‌ఎంపీ) చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డితో వైఎస్‌తో మాట్లాడించి ఈ వంతెన నిర్మాణానికి అంకురార్పణ చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ చొరవతో ఈ వంతెన నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో సరైన రహదారి లేక ప్రాణ నష్టం సంభవించిన సందర్భాలున్నాయి. దీంతో పాటు కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి తదితర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటాడిన సముద్ర సంపదను జిల్లా కేంద్రమైన మచిలీపట్నంకు తీసుకువచ్చేందుకు దూరభారంగా ఉండేది. సకాలంలో మత్స్యసంపద మార్కెట్‌కు చేరకుంటే చేపలు దెబ్బతిని ధర తగ్గిపోయేది. 1992లో కోడూరు మండలం ఉల్లిపాలెంకు చెందిన వ్యవసాయ కూలీలు బందరు మండలంలోని వాడపాలెం గ్రామానికి వచ్చి తిరిగి వెళుతుండగా పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
కోడూరు - మచిలీపట్నం మండలాల మధ్య కృష్ణానదిని దాటేందుకు పడవలే ఆధారం. ఈ కారణాల నేపథ్యంలో ఇక్కడ వంతెన నిర్మించాలనే ప్రతిపాదనను పేర్ని నాని తెరపైకి తెచ్చారు. వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయించారు. వంతెన ఎక్కడ నిర్మించాలనే అంశంపై కాకినాడ జేఎన్‌టీయూకు చెందిన ఇంజనీర్లు ఈ ప్రాంతాన్ని పలుమార్లు పరిశీలించారు. తొలుత ఉల్లిపాలెం - భవానీపురం మధ్య వంతెన నిర్మించాలనే ప్రతిపాదనను తయారు చేశారు. జేఎన్‌టీయూ ప్రతినిధులు వంతెన నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించి కృష్ణానది తక్కువ వెడల్పు ఉన్న చోటును గుర్తించారు. కృష్ణానది తక్కువ వెడల్పు ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మిస్తే దాదాపు రూ. 20 కోట్లు నిర్మాణ వ్యయం తగ్గుతుందని తేల్చారు.
ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ ఇన్‌చీఫ్ గంగాధర్, ఇతర ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి వంతెన నిర్మాణం జరిగే ప్రాంతాన్ని నిర్ధారించారు. ఉల్లిపాలెం గ్రామాల మధ్య వంతెన నిర్మించేందుకు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఉన్నతాధికారులతో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను ఒప్పించడంలో పేర్ని నాని తనదైన శైలిలో కృషి చేశారు. ఈ నేపథ్యంలో 21వ తేదీన ప్రకృతి విపత్తుల విభాగం కమిషనర్ సి.పార్థసారథి రూ. 63 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తగ్గనున్న 30 కిలోమీటర్ల దూరం
కోడూరు మండలవాసులు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే అవనిగడ్డ, చల్లపల్లిల మీదుగా రావాల్సి ఉంది. మచిలీపట్నం నుంచి కోడూరుకు రోడ్డు మార్గం 60 కిలోమీటర్ల మేర ఉంది. ఈ వంతెన నిర్మాణం జరిగితే కోడూరు మండల వాసులు వంతెన మీదుగా భవానీపురం వస్తే అక్కడి నుంచి చిన్నాపురం మీదుగా మచిలీపట్నం చేరుకోవచ్చు. దీంతో 30 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది.
భవానీపురం - ఉల్లిపాలెం గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి కృషి చేసిన పేర్ని నానికి ఉల్లిపాలెంతో పాటు కమ్మవారిచెరువు, కెపీటీపాలెం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతోనే వంతెన నిర్మాణం కోసం కృషి చేశానని ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వాటన్నింటిని అధిగమించి వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించగలిగానని బందరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని ‘న్యూస్‌లైన్‘కు తెలిపారు.


