అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రోత్సాహం | Benefits To Anganwadi Workers In PSR Nellore | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రోత్సాహం

Sep 3 2019 10:07 AM | Updated on Sep 3 2019 10:07 AM

Benefits To Anganwadi Workers In PSR Nellore - Sakshi

సాక్షి, వాకాడు: చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు అదనపు ప్రోత్సాహం అందిస్తోంది. సాధారణగా కేంద్రాల్లో చిన్నారులకు విద్యాబోధనతో పాటు కోడిగుడ్లు, పాలు, తదితర పౌష్టికాహారం అందిస్తోంది. అలాగే బాలింతలు, గర్భిణులకు బాల సంజీవని పేరుతో ఎండు ఖర్జూరం, వేరుశనగ అచ్చులు, రాగిపిండి, బెల్లం వంటి ఆహార పదార్థాలను పంపిణీ చేస్తోంది. అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన ఏడు నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు బాలామృతం ప్యాకెట్లు అందజేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువమంది వీటిని తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.

ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో అంగనవాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ప్రోత్సాహకాలను ప్రకటించింది. తద్వారా వంద శాతం లక్ష్యాలను పూర్తి చేసిన వారికి అధనపు నిధులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను మరింత అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాలతో పాటు, సిబ్బందికి వేతనాలు పెంచి ప్రోత్సహిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు సక్రమంగా అందేలా కేంద్రాల నిర్వహణలో కార్యకర్తలు, సహాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే పథకాలు క్షేత్రస్థాయిలో అందడానికి వారి సహకారం ఎంతో అవసరం. అందుకే వీరి ద్వారా ప్రభుత్వం అందించే సౌకర్యాలపై అవగాహన కల్పించి కేంద్రాలను సమర్థవంతంగా నడిపేందుకు కార్యకర్తలకు ట్యాబ్‌లు అందించి నగదు ప్రోత్సాహాలను ప్రవేశ పెట్టింది.

కోట ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు

మండలం అంగన్‌వాడీ కేంద్రాలు  కార్యకర్తలు చిన్నారులు బాలింతలు గర్భిణులు
వాకాడు 71 71 2371 316 296
కోట 76 76 2784 367 457
చిట్టమూరు 78 77 2521 307 373

కార్యకర్తలు వారి పరిధిలోని లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కల్పించి వారిని అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకురావాలి. అందుకు ప్రతిఫలంగా పోషక అభియాన్‌ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ సాయం అందిస్తోంది. వంద శాతం లక్ష్యాలను పూర్తి చేసిన కార్యకర్తలకు ప్రతినెలా రూ.500 చొప్పున ఇస్తున్నారు. నెలలో అంగనవాడీ కేంద్రాలను 21 రోజుల పాటు తెరిచి శుభ్రంగా ఉంచడంతో పాటు చిన్నారులను సమయానికి ఇంటి నుంచి తీసుకొచ్చి, తిరిగి ఇంటివద్ద వదిలిపెట్టిన ఆయాలకు ప్రభుత్వం అందిస్తున్న గౌరవ వేతనంతో పాటు అదనంగా నెలకు రూ.250 చొప్పున నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తోంది. కోట ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో వాకాడు, కోట, చిట్టమూరు మండలాలున్నాయి.

అందులో 225 కేంద్రాలకు గాను 224 మంది కార్యకర్తలు ఉన్నారు. వీరిలో ప్రారంభంలో 50 నుంచి 60 మంది కార్యకర్తలు నూరు శాతం లక్ష్యాలను సాధించి ఈ పథకం ద్వారా అందించే అదనపు ప్రోత్సాహకానికి ఎంపికైనట్టు అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ప్రతినెల ఈ సంఖ్య పెరుగుతూ జూలై నెలకు 180 మందికి పైగా పోషణ అభియాన్‌ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అర్హులైన వారందరికీ ఈ నెలలోనే ప్రోత్సాహకాన్ని జమచేసినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు మెరుగు పడడంతో పాటు అర్హులకు పౌష్టికాహారం సక్రమంగా చేరుతున్నట్లు వారు వెల్లడించారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement