టీడీపీ నేత దా‘రుణం’

BC Corporation Loan Fraud In Santhabommali At Srikakulam - Sakshi

విదేశంలో ఉన్న వారి పేరున బీసీ కార్పొరేషన్‌ రుణం

ఫోర్జరీ సంతకాలతో ఏమార్చిన టీడీపీ నేత

సహకరించిన కో ఆపరేటివ్‌ బ్యాంకు సిబ్బంది

ప్రస్తుత దరఖాస్తుతో బట్టబయలైన బండారం

సాక్షి, సంతబొమ్మాళి: అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు అవినీతిలో తమ నైజాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శించి అందినంత దోచుకున్నారు. అధికారం తమ చేతుల్లో ఉంది... అడిగేవారెవరన్నట్టు బరితెగించి స్వాహా చేశారు. ఆనాటి అన్యాయాలు ఇప్పటికీ ప్రజలను పీడించుకు తింటున్నాయి. ఓ మాజీ ప్రజాప్రతినిధి భర్త, జన్మభూమి కమిటీ సభ్యుడైన ఓ టీడీపీ నేత మరొకరి పేరిట బీసీ కార్పొరేషన్‌ రుణాన్ని తీసుకొని అనుభవించిన వైనం బయట పడింది. వివరాల్లోకి వెళితే... సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన గిన్ని కోటేష్‌ అనే నిరుద్యోగి ఈ నెల 12న బీసీ కార్పొరేషన్‌ రుణం కోసం దరఖాస్తు చేయడానికి మీ–సేవా కేంద్రానికి వెళ్లాడు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రయత్నించగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో లక్ష రూపాయలు మంజూరైనట్లు చూపడంతో అవాక్కయ్యాడు.

ఈ విషయాన్ని తన తండ్రి నూకరాజుకు చెప్పగా... ‘నీవు విదేశాల్లో ఉన్న సమయంలో టీడీపీ నేతకు చెందిన బంధువు ఒకరు వచ్చి నీ కుమారుడి పేరున బీసీ కార్పొరేషన్‌ రుణం మంజూరు చేయిస్తానని 7 వేల రూపాయల నగదు, ఆధార్‌ కార్డు, ఫొటోలు తీసుకున్నారని, ఇంత వరకు రుణానికి సంబంధించిన నగదు ఇవ్వలేద’ని తండ్రి నూకరాజు చెప్పారు. దీంతో కోటేష్‌ సదరు టీడీపీ నేతను బీసీ కార్పొరేషన్‌ రుణం కోసం అడుగగా.. కొంత సమయం కావాలని చెప్పి వాయిదాలు వేయడంతో బాధితుడు విసుగుచెందాడు. దీంతో నేరుగా కోటబొమ్మాళి కో ఆపరేటివ్‌ బ్యాంకుకు వెళ్లి బ్యాంకు మేనేజర్‌తో జరిగిన విషయాన్ని కోటేష్‌ వివరించాడు.

దానికి సంబంధించిన ఫైలు తెప్పించి పరిశీలించగా, 2018 డిసెంబర్‌ 4న బీసీ కార్పొరేషన్‌ రుణం కింద లక్ష రూపాయల రుణంలో 50 వేల రూపాయల సబ్సిడీ ఉందని.. రుణం ఖాతా నంబరు 010453680000970 అని తెలిపా రు. ‘ఫైలు, చెక్కు పై నీ సంతకాలు ఉన్నాయ’ని బ్యాంకు మేనేజర్‌  చెప్పగా ఆ సమయంలో తాను సౌతాఫ్రికాలో (విదేశం) పని చేస్తున్నానని, తన సంతకాలు ఫోర్జరీ చేసి రుణం మొత్తం కాజేశారని కోటేష్‌ సమాధా నం ఇచ్చాడు. బ్యాంకు రుణం పుస్తకాలు సైతం తన వద్ద లేవని ఎవరి వద్ద ఉన్నాయో అంతు చిక్కడం లేదని బదులిచ్చాడు. ఇదిలా ఉంటే ఈ విషయం బయటకు చెబితే మరోలా ఉంటుందని సదరు టీడీపీ నేత బెదిరించడం కొసమెరుపు.

‘సాక్షి’ ఆనాడే చెప్పింది...
సంతబొమ్మాళి మండలంలో బీసీ కార్పొరేషన్‌ రుణాల మంజూరులో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ‘సాక్షి’ పత్రికలో గతంలో కథనాలు వచ్చాయి. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండడంతో అధికారులు సైతం నోరుమెదపలేని పరిస్థితి చోటు చేసుకుంది. సదరు టీడీపీ నేత బీసీ కార్పొరేషన్‌ రుణాలను భారీగా దోచుకున్నారని సొంత పార్టీ నేతలే అప్పట్లో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో అడ్డుకట్ట వేయకపోవడంతో అవినీతికి అంతు లేకుండా పోయింది. బీసీ కార్పొరేషన్‌ రుణాల మంజూరులో ఉన్నతాధికారులు విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు బయట పడతాయని స్థానికులు అంటున్నారు.

విదేశాల్లో ఉంటే రుణం ఎలా ఇచ్చారు?
నేను సౌతాఫ్రికాలో 2018 ఆగస్టు నుంచి 2019 ఫిబ్రవరి 2 వరకు ఆరు నెలల పాటు పనిచేశాను. ఆ సమయంలో బ్యాంకు అధికారులు రుణం ఏ విధంగా మంజూరు చేసి ఇచ్చారో వారే సమాధానం చెప్పాలి. ఫైలు, చెక్కులపై నా సంతకాలు ఫోర్జరీ చేసి దోచుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. 
–గిన్ని కోటేష్, బాధితుడు, నౌపడ, సంతబొమ్మాళి మండలం

బాధ్యులపై చర్యలు తప్పవు
ఈ విషయం నా దృష్టికి ఇంతవరకు రాలేదు. సోమవారం డీసీసీబీ బ్యాంకుకు సిబ్బందిని పంపి వివరాలు సేకరించి విచారణ చేపడతాం. తప్పని తేలితే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవు.
–రాజారావు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ, శ్రీకాకుళం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top