బాసర, మంచిర్యాల ఘటనల్లో పురోగతి శూన్యం | Basra, manciryala robbery, murder cases, let go of Mystery | Sakshi
Sakshi News home page

బాసర, మంచిర్యాల ఘటనల్లో పురోగతి శూన్యం

Oct 3 2013 3:55 AM | Updated on Aug 17 2018 2:53 PM

జిల్లాలో సంచలనం కలిగించిన బాసర, మంచిర్యాల దోపిడీ, హత్య కేసుల మిస్టరీ వీడలేదు. నెలన్నర అవుతున్నా పురోగతి లేదు.

 ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో సంచలనం కలిగించిన బాసర, మంచిర్యాల దోపిడీ, హత్య కేసుల మిస్టరీ వీడలేదు. నెలన్నర అవుతున్నా పురోగతి లేదు. మహారాష్ట్ర, కర్నాటకలో పోలీసులు గాలిస్తున్నా నిందితుల ఆచూకీ లభించడం లేదు. బాసర హత్య కేసు లో చోరీకి గురైన కారును మెదక్ జిల్లాలో స్వాధీనం చేసుకోవడం మినహా పోలీసులు సాధించింది ఏమి లేదు. ఈ రెండు కేసులను ఛేదించడానికి ఉన్నతాధికారులు ఐదు పోలీసు బృందాలను నియమించినా కేసులు కొలిక్కిరావడం లేదు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో ఐదుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసి జిల్లాకు తీసుకొచ్చినట్లు సమాచా రం. ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గతంలో ఓ మందిరంలో జరిగిన దొంగతనం కేసులో వీరి పాత్ర ఉన్నట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. బాసర, మంచిర్యాల కేసులతో ఈ దొంగలకు ఏదైన సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
 
 కొనసాగుతున్న శోధన
 ఆగస్టు 16 అర్ధరాత్రి దాటిన తర్వాత బాసరలో వ్యాపారి అశోక్‌స్వామి, ఆయన భార్య సువర్ణ, పెద్దకుమారుడు మణికంఠలను అగంతకులు దారుణంగా హతమర్చారు. చిన్నకుమారుడు శరత్ చంద్ర(10)పై కూడా దాడి చేయగా, తీవ్ర గాయాలయ్యాయి. శరత్‌చంద్ర ఇచ్చిన సమాచారంతో పోలీసులు శోధిస్తున్నారు. దొంగలు ముసుగు ధరించి వచ్చినట్లు శరత్‌చంద్ర పేర్కొన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర పార్థిముఠా ఇలాగే ముసుగు ధరించి దోపిడీ, హత్యలకు పాల్పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో కొంత కర్ణాటక దొంగల ముఠాపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాసర సంఘటన మరుసటి రోజే ఆగస్టు 17న మంచిర్యాలలో దోపిడీ దొంగల చేతిలో హత్యకు గురైన దుర్గమ్మ, రవీందర్ హత్యకు గురయ్యారు. బాసరలో ముగ్గురిని హత్య చేసిన ముఠానే ఈ హత్యలకు పాల్పడిందా? లేనిపక్షంలో మరో దొంగల ముఠా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ఒక నిర్ధారణకు రానట్టు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల్లో దోపిడీ, హత్యలకు పాల్పడిన కర్ణాటకు చెందిన పార్థి గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారికి జిల్లా కేసులతో సంబంధం ఉందా లేదా అనే విషయంలో ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే హత్య కేసుల శోధన కోసం నియమించిన ఐదు పోలీసు బృందాలు కర్ణాటకలోని బీదర్, గుల్‌బర్గా, రాయిచూర్, ఉశంగబాద్, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్, లాతూర్, పర్బని, నాందేడ్‌లతోపాటు పలు ప్రాంతాల్లో దొంగల కోసం గాలించారు.
 
 కర్ణాటక, బీదర్‌లో ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసి జిల్లాకు తీసుకొచ్చారనేది సమాచారం. ఇద్దరిని ఇప్పటికే రిమాండ్ చేయగా మరో ముగ్గురిని విచారణ చేస్తున్నారు. ఇటీవల వీరిని బాసర తీసుకెళ్లి విచారించినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ ఐదుగురు నిందితులకు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో దుర్గా మందిరంలో జరిగిన చోరీ కేసుకు సంబంధం ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారనేది సమాచారం. కొంత బంగారంతోపాటు వెండిని స్వాధీనం చేసుకున్నారనేది వినికిడి. ఈ ఐదుగురు నిందితులతోపాటు మరో ముగ్గురు ఇలాంటి దొంగతనాలకు పాల్పడతారనే సమాచారంతో మిగతా ముగ్గురి కోసం కూడా వెతుకుతున్నారు. ఆదిలాబాద్‌లో గతంలో నివసించిన ఒక వ్యక్తి అరెస్ట్ అయిన గ్యాంగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement