బేరం కుదిరింది

bargain was broke down - Sakshi

 కర్నూలు ఎంపీని చేర్చుకునేందుకు అధికార పార్టీ ప్రణాళిక

బుట్టా రేణుక త్వరలో పార్టీ మారేందుకు రంగం సిద్ధం

రూ.70 కోట్ల భారీ ప్యాకేజీతో పాటు పలు కాంట్రాక్టులు ఎర 

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి ప్రలోభాలకు తెరలేపింది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక శుక్రవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో సమావేశమైనట్టు తెలుస్తోంది. చంద్రబాబు అమెరికా పర్యటన తర్వాత రేణుక పార్టీ మారేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. వచ్చే నెల 2వ తేదీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో.. పాదయాత్రకు జనం నుంచి వచ్చే స్పందనను పక్కదోవ పట్టించేందుకు అధికార పార్టీ ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటుతో పాటు ఎన్నికలకు అయ్యే మొత్తం వ్యయాన్ని కూడా భరిస్తామని బుట్టా రేణుకకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే తక్షణ ప్రయోజనంగా రూ.70 కోట్ల భారీ ప్యాకేజీతో పాటు పలు కాంట్రాక్టులు కూడా కట్టబెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అదే రాజకీయ దిగజారుడుతనం...!
వాస్తవానికి అధికార తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి రాజకీయ దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. సంతలో కొనుగోలు చేసినట్టు ఒక్కొక్కరికి ఒక్కో రేటు కట్టి మరీ కొనుగోలు చేసింది. అంతేకాకుండా రాజకీయ విలువలను తోసిరాజని రాజీనామా చేయని నలుగురికి మంత్రి పదవులను కట్టబెట్టింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు ప్యాకేజీని కూడా ఇచ్చింది. ఈ విధంగా పార్టీ మారిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు పొందినవారు ఇప్పటికీ రాజీనామా చేయకపోవడం గమనార్హం. ఎన్నికల్లో గెలిచిన మూడు రోజులకే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. ఇప్పటివరకు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు.

ఆయనతో పాటు బుట్టా రేణుక భర్త నీలకంఠం కూడా తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ బుజ్జగింపులు, ఎమ్మెల్యేలు నచ్చజెప్పడంతో తాత్కాలికంగా పార్టీ మారడాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం అభివృద్ధి కార్యక్రమాల పేరిట మంత్రి లోకేష్‌ను బుట్టా రేణుక కలిసారు. దీనిపై అప్పట్లోనే పార్టీ ఎమ్మెల్యేల నుండి నిరసన వ్యక్తం అయ్యింది.    తాజాగా బుట్టా రేణుకను రాజీనామా చేయకుండానే పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top