ఆంక్షల నడుమ ఎగిరిన బెలూన్‌

Baloon Festival in Araku Valley Visakhapatnam - Sakshi

ఆలస్యంగా ప్రారంభమైన బెలూన్‌ ఫెస్టివల్‌

పర్యాటకులకు నిరాశ

విశాఖపట్నం, అరకులోయ/డుంబ్రిగుడ/అనంతగిరి: అరకులోయలో బెలూన్‌ ఫెస్ట్‌వల్‌ కార్యక్రమాన్ని గత ఏడాది నుంచి ప్రభుత్వం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో బెలూన్‌ జరుగుతున్నాయి. గత ఏడాదిలో బెలూన్‌ ఫెస్ట్‌వల్‌కు వర్షాల కారణం ప్రతికూల వాతవరణం సహకరించకపోవడం బెలూన్‌లు గాలిల్లోకి ఎగరలేదు. దీంతో  పర్యాటకులు, స్థానిక గిరిజనులు నిరాశ చెందారు.
ఈ ఏడాదిలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ బెలూన్‌ ఫెస్టివల్‌కు ప్రభుత్వం 4 కోట్ల రుపాయలను వెచ్చిస్తుంది. సుమారు 11 గంటల సమయం వరకు మంచు కురువడంతో ఆలస్యంగా బెలూన్‌ ఫెస్ట్‌వల్‌ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాడేరు ఐటీడీఏ పీవో డీకే బాలాజీ ఫెస్టివల్‌ను ప్రారంభించి మొదటి బెలూన్‌లోరిజన విద్యార్థులతో కలసి గాల్లోకి ఎగిరారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో సందర్శకుల కంటే పోలీసులే అధికంగా కనిపించారు.

మొదటి రోజు గందరగోళం...
మొదటిరోజు ప్రారంభమైన బెలూన్‌ ఫెస్టివల్‌ కార్యక్రమంలో గందరగోళం సాగింది. అసలు ఏవిధంగా బెలూన్లను ఎగరవేస్తారు. మొదటిరోజు ఎంతమంది పాల్గొంటున్నారో అధికారులకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. రెండు తెలుగు  రాష్ట్రాలు పర్యాటకులు భారీగా అరకులోయ చేరుకున్నారు. బెలూన్‌లో ఎగిరేందుకు సరదాపడిన పర్యాటకులకు సమాచారం అందించేవారు కూడా కరువయ్యారు. స్థానిక గిరిజనులు మాత్రం అంతంతమాత్రంగానే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చారు.

గిరిజనులకు చేదు అనుభవం
బెలూన్‌ ఫెస్టివల్‌ తిలకించేందుకు వచ్చిన స్థానిక గిరిజనులకు పోలీసుల ఆంక్షలతో చేదు అనుభవం ఎదురైంది. ఫెస్టివల్‌ జరిగే ప్రదేశంలో ఎక్కువసేపు ఉండకూడదంటూ పోలీసులు వారిని అక్కడి నుంచి పంపే కార్యక్రమం చేపట్టారు. దీంతో ఇటువంటి కార్యక్రమంతో ఎవరిని ఆనందింపజేస్తున్నారని పలువురు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.

నైట్‌ షో
బెలూన్‌ ఫెస్ట్‌వల్‌ సాయంత్రం 6 నుంచి గంటల నుంచి 8 గంటల వరకు బెలూన్‌ నైట్‌ షోను సందర్శకులు కోరకు  ఏర్పాటు చేశారు. బెలూన్‌ ఫెస్ట్‌వల్‌లో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నా వారికి వంద అడుగులు ఎత్తువరకు గాల్లోకి బెలూన్‌ ఎగరవేసి దించారు. పర్యాటకులు అధికంగా వచ్చి ఫెస్టివల్‌ను తిలకించారు. కొంతసేపు వరకు మాత్రము బెలూన్‌లు ఎగరలేదు. తరువాత ఎగరడంతో సందర్శకులు ఆనందపడ్డారు.

15 దేశాల బెలూన్లు
సాక్షి, విశాఖపట్నం: ఈసారి ఫెస్టివల్‌లో భారత్, ఇంగ్లండ్, థాయ్‌లాండ్, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, మలేసియా, నెథర్లాండ్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, బెల్జియం, ఇటలీ, స్లోవేకియా, బ్రెజిల్‌ తదితర 15 దేశాలకు చెందిన 21 బెలూన్లు పాల్గొన్నాయి. వీటిలో క్లోన్‌ (స్లోవేకియా), హ్యాపీచికెన్‌ (నెథర్లాండ్స్‌), బేబీకార్‌ (బ్రెజిల్‌), బీ (బ్రెజిల్‌) బెలూన్లు జోకర్, బేబీకార్, తేనెటీగ, గుడ్డు ఇలా విభిన్న ఆకృతుల్లో తయారు చేసినవి కూడా ఉన్నాయి. తొలిరోజు ఉదయం 18, సాయంత్రం మూడు బెలూన్లను గాలిలోకి పంపారు. గంటకు 3000 హార్స్‌పవర్‌ కలిగిన గ్యాస్‌ను వెలిగిస్తూ గాల్లోకి తీసుకెళ్లారు. ఇందుకు ఒక్కో బెలూన్‌ గంటకు 120 కిలోల గ్యాస్‌ను ఖర్చు చేస్తోంది. ఒక్కో బెలూన్‌లో సామర్థ్యాన్ని బట్టి 5–8 మంది వరకు ప్రయాణించగలిగారు. ఒక్కో బెలూన్‌లో ఒక్కో పైలట్, మరో కో–పైలెట్‌ ఉన్నారు. ఈ బెలూన్లు 3 నుంచి 5 వేల అడుగుల ఎత్తులో అరకులోయ పరిసరాల్లో గంటకు పైగా విహరించాయి.

అరకు ఎంతో అనుకూలం : మంత్రి అఖిలప్రియ
అరకులోయ/డుంబ్రిగుడ/అనంతగిరి: బెలూన్‌ ఫెస్ట్‌వల్‌ నిర్వహించేం దుకు అరుకులోయ ప్రాం తం అనుకూలంగా ఉంద ని పర్యాటకశాఖ మంత్రి భూమ అఖిలప్రియ అన్నారు. బెలూన్‌ ఫెస్టివల్‌కు హాజరైన విదేశీయుల కోసం  మాడగడలో సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రాలను ఆమె సందర్శించారు. అనంతరం విదేశీయులతో కలసి భోజనం చేశారు. అనంతరం అమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అరకు అందాలు విదేశీయులకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, దేశంలోనే బెలూన్‌ ఫెస్ట్‌వల్‌ నిర్వహించేందుకు అరకు వేదికగా కావడం ఆనందంగా ఉందని అన్నారు. లాటరీ ద్వారా బెలూన్‌ ఫెస్ట్‌వల్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. భవిష్యత్‌లో ఈ కార్యక్రమం పర్మనెంట్‌గా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

బెలూన్‌లో ఎగిరే అవకాశమే రాలేదు
బెలూన్‌లో ఎగిరేందుకు అవకాశం రాకపోవడంతో నిరాశ పడ్డాం. కుటుంబ సమేతంగా అరకులోయ ముఖ్యంగా బెలూన్‌ ఫెస్ట్‌వల్‌ కార్యక్రమం ఉందని తెలిసి వచ్చాను. అయితే ఇక్కడ పాల్గొనేందుకు అవకాశం లేకపోవడం నిరాశపరిచింది. అసలు ఆన్‌లైన్‌లో కూడా   బెలూన్‌ ఫెస్ట్‌వల్‌కు సంబంధించ షెడ్యూల్‌ సమాచారం లేకపోవడం దారుణం.   – శ్రీనివాస్, విశాఖపట్నం

గిరిజనులకు ఏం ఉపయోగం
అరకులోయలో బెలూన్‌ ఫెస్ట్‌వల్‌ నిర్వహించడం వల్ల గిరిజనులకు ఎటువంటి ఉపయోగం లేదు. గిరిజన గ్రామాల్లో తాగునీరు, విద్య, వైద్యం వంటి సమస్యలతో గిరిజనులు నిత్యం నరకయాతన అనుభవిస్తుంటే బెలూన్‌ ఫెస్ట్‌వల్‌ పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారు.  – ఎం. సునీల్,గిరిజన యువకుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top