బాల సాయిబాబా కన్నుమూత

Bala Sai Baba Passed Away Due To Heart Attack - Sakshi

హైదరాబాద్: కర్నూలు జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా గుండెపోటుతో మృతి చెందారు. బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. సోమవారం అర్ధరాత్రి దోమలగూడలోని ఆశ్రయంలో గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 

బాల సాయిబాబా 1960 జనవరి 14న కర్నూలులో జన్మించారు. ఆయన తండ్రి రామనాథ శాస్త్రి కేరళ నుంచి కర్నూలుకు వలస వచ్చారు. బాల సాయిబాబాకు 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే కర్నూలులో తొలి ఆశ్రమాన్ని స్థాపించారు. కడుపులో నుంచి శివలింగాన్ని తీసే విద్య ద్వారా ఆయన ప్రాచుర్యం పొందారు. అయితే మధ్యలో కొంతకాలం బాల సాయిబాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనకు కర్నూలుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భక్తులు ఉన్నారు. శివరాత్రికి, సంక్రాంతికి బాల సాయిబాబా ఆశ్రమంలో జరిగే ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చేవారు. గతంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేవి. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేవారు. 

బాల సాయిబాబా ఆధ్యాత్మికతతో ఎంతగా వార్తల్లో నిలిచారో.. అదేవిధంగా అనేక వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా ఉన్నారు. జన విజ్ఞాన వేదిక సభ్యులు ఆయనపై తీవ్ర విమర్శలు చేసేవారు. అదేవిధంగా ట్రస్ట్‌ పేరుతో భారీగా ఆస్తులు కూడగట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఆయన భౌతిక కాయాన్ని కర్నూలు తరలిస్తామని బాల సాయిబాబా అనుచరుడు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top