రోడ్డున పడ్డ 2500 మంది కార్మికులు

Bajarang Jute Mill Convenor Meets Labour Minister Jayaram In Guntur  - Sakshi

సాక్షి, గుంటూరు : గుంటూరు నగరం పట్టాభిపురంలోని భజరంగ్‌ జూట్‌ మిల్లును లాకౌట్‌ చేయడం వల్ల 2500 మంది కార్మికులు రోడ్డు పడ్డారని, మిల్లు తిరిగి ప్రారంభించి వారికి జీవనోపాధి కల్పించాలని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను వైఎస్సార్‌ సీపీ నాయకుడు, జూట్‌ మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్‌ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. కార్మిక శాఖ మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉదయలక్ష్మిలతో నాయకులు గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా జూట్‌ మిల్లు లాకౌట్‌ చేసి వేలాది మంది కార్మికుల పొట్టకొట్టిన యాజమాన్యానికి గత ప్రభుత్వం కొమ్ముకాసిందని చెప్పారు. 1994లో బీఐఎఫ్‌ఆర్‌ పద్ధతిలో 40 శాతం కార్మికుల వాటా, 60 శాతం యాజమాన్యం వాటా కింద మిల్లును నిర్వహించేలా అప్పటి ప్రభుత్వం ఈస్ట్‌ ఇండియా కంపెనీకి అనుమతులు ఇచ్చిందన్నారు. 40 శాతం కార్మికుల వాటను ప్రభుత్వమే సమకూర్చేలా ఒప్పందం జరిగిందన్నారు. 2014 వరకూ మిల్లు సజావుగా సాగిందని, ఉత్తమ మేనేజ్‌మెంట్‌ అవార్డును సైతం ప్రభుత్వం నుంచి మిల్లు యాజమాన్యం తీసుకుందన్నారు. 

2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని గుంటూరు జిల్లాలో ఏర్పడటంతో భూముల విలువ అమాంతం పెరగడంతో మిల్లు భూములను రియల్టర్లకు విక్రయించాలని యాజమాన్యం నిర్ణయించుకుందన్నారు. ఇందులో భాగంగా 2015 మే 12న మిల్లు భూములను యాజమన్యం విక్రయించగా, అదే సంవత్సరం జూలై 4న యాజమాన్యం మిల్లు లాకౌట్‌ చేసిందని వివరించారు. బీఐఎఫ్‌ఆర్‌ పద్ధతిలో మిల్లు నిర్వహించడానికి యాజమాన్యానికి ప్రభుత్వం అనేక రాయితీలిచ్చిందని వెల్లడించారు. కానీ స్వప్రయోజనాల కోసం యాజమాన్యం మిల్లును లాకౌట్‌ చేసిందన్నారు.  

సమగ్ర విచారణ చేయిస్తాం..
మిల్లు లాకౌట్‌ చేసి యాజమాన్యం కార్మికుల పొట్టకొట్టిన విధానాన్ని నాయకులు వివరించిన అనంతరం మంత్రి గుమ్మనూరు జయరామ్‌ స్పందిస్తూ నెల రోజుల్లో అధికారులతో సమగ్ర విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. విచారణ చేయించి నివేదికలు తెప్పించుకుని నాయకులతో మళ్లీ సమావేశం నిర్వíßహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలుస్తుందని, జూట్‌ మిల్లు మూత పడటంతో రోడ్డున పడ్డ కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. మంత్రిని కలిసిన వారిలో కార్మిక నాయకులు పాండు, సాంబ, మోసే, వైఎస్సార్‌సీపీ నాయకులు షౌకత్, తోట ఆంజనేయులు, పానుగంటి చైతన్య తదితరులు ఉన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top