రెచ్చిపోయిన టీడీపీ నేతలు | Attack on the constable | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన టీడీపీ నేతలు

Oct 9 2017 2:46 AM | Updated on Aug 10 2018 9:42 PM

Attack on the constable - Sakshi

ఇబ్రహీంపట్నం(మైలవరం)/ఇందుకూరుపేట: పోలీసులపై టీడీపీ నేతలు రెచ్చిపోయారు. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి తెగబడ్డారు. తమ మాట కాదని.. ఉద్యోగాలెలా చేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగారు.   

మమ్మల్నే అడ్డుకుంటావా..
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సెంటర్‌లో శనివారం రాత్రి పలువురు పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్న లారీని పక్కకు తీయాలని కానిస్టేబుల్‌ రమణ కోరడంతో.. దాని యజమాని అయిన టీడీపీ నాయకుడు జాస్తి సారథి గొడవకు దిగాడు. ఇంతలో టీడీపీ నాయకులు, మంత్రి అనుచరులైన చనుమోలు నారాయణ, రామకృష్ణ, జాస్తి శ్రీను తదితరులు అక్కడకు చేరుకున్నారు.

వారిని చూసిన సారథి మరింత రెచ్చిపోతూ కానిస్టేబుల్‌ రమణపై దాడి చేసి.. చెంప ఛెళ్లుమనిపించాడు. కానిస్టేబుల్‌పై దాడి విషయం తెలుసుకున్న వెస్ట్‌జోన్‌ ఏసీపీ జి.రామకృష్ణ వెంటనే ఇబ్రహీంపట్నం చేరుకొని వివాదంపై ఆరా తీశారు. రమణపై దౌర్జన్యం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కానీ ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసు లేకుండా చేసేందుకు టీడీపీ నేతలు పావులు కదిపారు. కానీ సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ కావడంతో.. తప్పనిసరి పరిస్థితిలో జాస్తి సారథిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

నువ్వు ఇక్కడెలా పనిచేస్తావో చూస్తా..
‘అధికార పార్టీ నేతలని తెలిసినా మాపై కేసులు పెడతావా? నువ్వు ఇక్కడెలా పనిచేస్తావో చూస్తాం..’ అంటూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సోమరాజుపల్లికి చెందిన టీడీపీ నేత, ఏఎంసీ డైరెక్టర్‌ దేవిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోలీసులపై దౌర్జన్యానికి దిగారు.  రెండు రోజుల కిందట కానిస్టేబుల్‌ నక్కా శివాజీపై సోమరాజుపల్లికి చెందిన పలువురు టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ కేసుకు సంబంధించిన నిందితులను ఎస్సై బలరాంరెడ్డి అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకువచ్చారు.

ఈ విషయం తెలుసుకున్న చంద్రమోహన్‌రెడ్డి స్టేషన్‌కు వచ్చి ఏఎస్సై రామలింగయ్య, సిబ్బందిని దుర్భాషలాడారు. ఇంతలో ఎస్సై బలరాంరెడ్డి స్టేషన్‌కు చేరుకోగా.. ఆయనపై కూడా అధికార పార్టీ నాయకులు విరుచుకుపడ్డారు. ఒక దశలో చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎస్సైపై దాడికి ప్రయత్నించారు. ఇంతలో పోలీస్‌ సిబ్బంది.. బలవంతంగా చంద్రమోహన్‌రెడ్డిని లాకప్‌లోకి నెట్టి తాళం వేశారు. విషయం కాస్తా అధికార పార్టీ పెద్దల వరకు వెళ్లడంతో.. చంద్రమోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు పోలీసు అధికారులు తటపటాయిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement