తమ్ముడి కోసం అస్సాం నుంచి ఆంధ్రాకి.. | Assam Man Missed In Vizianagaram | Sakshi
Sakshi News home page

తమ్ముడూ ఎక్కడున్నావ్‌..

Jul 20 2018 12:37 PM | Updated on Jul 20 2018 12:37 PM

Assam Man Missed In Vizianagaram - Sakshi

తమ్ముడి ఆచూకీ కోసం నెల్లిమర్ల పోలీస్‌ స్టేషన్‌లో విచారిస్తున్న అసోం మహిళ లబ్బా 

నెల్లిమర్ల విజయనగరం : ఊరు కాని ఊరు. భాష తెలియని ప్రాంతం. ఆచారాలు.. సంప్రదాయాలు.. అన్నీ భిన్నమైన ప్రాంతం. తోడబుట్టిన వాడి కోసం ఓ అక్క అన్వేషించింది. రాష్ట్రాలు దాటి తరలి వచ్చింది. సోదరుడి ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరైంది. తమ్ముడు కనిపిస్తే చెప్పండని ఫొటోలు చూపించింది. గుండెల్ని పిండేసే ఈ దృశ్యానికి నెల్లిమర్ల పోలీసు స్టేషన్‌ వేదికైంది.అసోం రాష్ట్రానికి చెందిన పూర్ణ సింగ్లామా అనే వ్యక్తి అసోం-గౌహతి రైలులో ప్రయాణిస్తుండగా జూన్‌ నెల 15న నెల్లిమర్ల-చీపురుపల్లి రైల్వే స్టేషన్లలో మార్గ మధ్యంలో తప్పిపోయాడు.

మూడు రోజుల తరువాత నెల్లిమర్లలో కొండపేట గ్రామానికి చెందిన నడిపేన లోకేష్‌ అనే యువకుడికి తారసపడ్డాడు. ఆయన మొబైల్‌ను అడిగి అసోంలోని తన అక్క లబ్బాకు ఫోన్‌ చేశాడు. అప్పటికే తప్పిపోయిన తమ్ముడి కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు ఈ ఫోన్‌ కాల్‌ కొంత ఊరటనిచ్చింది. తమ్ముడు క్షేమంగానే ఉన్నాడని.. ఇక ఇంటికి వచ్చేస్తాడని భావించారు. తమ్ముడి ఆచూకీ కోసం తరచూ ఫోన్‌ చేస్తుండటంతో విసుగు చెందిన లోకేష్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు.

రోజులు గడుస్తున్నా తమ్ముడి ఆచూకీ తెలియకపోవడం.. లోకేష్‌ స్విచ్ఛాఫ్‌ చేయడంతో ఫోన్‌ నంబర్‌ లొకేషన్‌ ఆధారంగా బుధవారం నెల్లిమర్లకు వచ్చారు. నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫోన్‌ చేసిన యువకుడిని పిలిపించారు. కొండపేటకు చెందిన లోకేష్‌ మాట్లాడుతూ ఒక వ్యక్తి తన మొబైల్‌ అడిగి ఫోన్‌ చేశాడని.. తరువాత వెళ్లిపోయాడని.. అంతకుమించి వివరాలు తెలియవని సమాధానమిచ్చాడు.

దీంతో పూర్ణ సింగ్లామా అక్క, ఇతర కుటుంబ సభ్యులు నిరాశ చెందారు. రైల్వే జీఆర్‌పీని సంప్రదించమని నెల్లిమర్ల ఎస్‌ఐ ఉపేంద్రరావు సూచించారు. చేసేది లేక పూర్ణ సింగ్లామా అక్క లబ్బా వెంట తెచ్చుకున్న తమ్ముడి ఫొటోను పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వారికి చూపిస్తూ ఆచూకీ తెలిస్తే తెలపండని తమ భాషలో ప్రాధేయపడింది.

కంటతడి పెడుతూ నెల్లిమర్ల పట్టణం మొత్తం తిరిగి గోడలకు తన తమ్ముడి ముఖ చిత్రాలను స్వయంగా అంటించింది. ఆచూకీ తెలిస్తే 9957971910 నంబర్‌కు తెలియజేయాలని కోరింది. తమ్ముడి ఆచూకీ కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన అక్క ఆరాటాన్ని చూసిన వారంతా చలించిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement