ఏజెన్సీలో రూ.80 లక్షల బకాయిలు | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో రూ.80 లక్షల బకాయిలు

Published Mon, Sep 15 2014 2:33 AM

Arrears of Rs 80 lakh to the agency

 సీతంపేట: ఏజెన్సీలోని ఆదివాసులకూ ఇళ్ల తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే సుమారు రూ.80 లక్షల బిల్లులు పెండింగులో ఉండిపోగా.. ఇప్పుడు మొత్తం ఇళ్లే రద్దవుతాయన్న ఆందోళన గిరిజనులను వేధిస్తోంది. మూడు దశల్లో ఇందిరమ్మ ఆదర్శ గ్రామాల్లో  6,105 ఇళ్లు మంజూరు కాగా సుమారు 4 వేల ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. అలాగే రచ్చబండ 1, 2 దశల్లో, 171 జీవో ద్వారా మరో 1342 ఇళ్లు మంజూరు కాగా 361 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. యూనిట్ విలువ రూ. లక్షలోపే ఉండడం, నిర్మాణానికి అది ఎంతమాత్రం సరిపోకపోవడంతో గిరిజన లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. గత సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట కార్యక్రమంలో సీతంపేట వచ్చినపుడు  కొండపైనున్న గ్రామాల్లో ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వమే ఇళ్లు కట్టిం చి ఇస్తుందని,  నిర్మాణ వ్య యా న్ని రూ. లక్షా పదివేలకు పెంచుతామని ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ధరలు పెరిగిన పరిస్థితుల్లో కొండలపై ఇల్లు నిర్మించాలంటే కనీసం రూ. 3 లక్షలు అవసరం. దీనికి తోడు బిల్లులు మంజూరు కాకపోవడంతో నిర్మాణా లు మధ్యలోనే నిలిచిపోతున్నా యి.
 
 రద్దవుతాయన్న ఆందోళన
 మరోవైపు మంజూరైన ఇళ్లు రద్దు అవుతాయని ప్రచారం జరుగుతుండటంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇళ్లు మంజూరై ఆర్థికపరమైన కారణాలతో నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే సుమారు 1500 ఇళ్లు రద్దయ్యే అవకాశముంది. ఈ విషయమై హౌసింగ్ జేఈ లాలాలజపతిరాయ్ వద్ద ప్రస్తావించగా బిల్లుల చెల్లింపు విషయమై ఇంతవరకు ఆదేశాలు రాలేదన్నారు.  
 

Advertisement
Advertisement