ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?: గడికోట | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?: గడికోట

Published Sat, Sep 6 2014 2:41 AM

ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?: గడికోట

సాక్షి, హైదరాబాద్: మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పదే పదే వైఎస్ రాజశేఖరరెడ్డిని దూషిస్తూ సాగిన మంత్రుల ప్రసంగంపై శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపణ తెలిపారు. 1994 నుంచి 2004 వరకూ మీ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో దానిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ప్రతి ప్రాజెక్టుపైనా తాము చర్చకు సిద్ధమని, దీనికి టీడీపీ సభ్యులు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతును రాజుగా చూసేందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారని, వైఎస్ హయాంలో రూ.47 వేల కోట్లు ఖర్చు చేస్తే మీరు లక్షకోట్లు అంటూ దుష్ర్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
 
 ఇంతలోనే మంత్రి ప్రత్తిపాటి... తల్లి కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్ అని సంబోధించగానే, శ్రీకాంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేస్తూ, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉందని,  ఆ తర్వాత టీడీపీ అలయెన్స్ ప్రభుత్వమే అధికారంలో ఉందని అన్నారు. రాజశేఖరరెడ్డి వారసులుగా ఐదేళ్ల ఆయన పదవీ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకునేందుకు గర్వపడుతున్నామన్నారు. ఆయన మరణానంతరం అధికారంలో ఉన్న తెలుగు కాంగ్రెస్‌తోనే ప్రజ లకు కష్టాలు మొదలయ్యాయన్నారు. ఉమామహేశ్వరరావు పదే పదే తెలుగు గంగ ఎన్టీఆర్ హయాంలో చేపట్టారని చెబుతూండగా... టీడీపీ ఏదిచేసినా ఎన్టీఆర్ చేశారని చెప్పుకోవచ్చుగానీ, చంద్రబాబు ఏదైనా ప్రాజెక్టు కట్టారని ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. మీరు  రైతుల ప్రభుత్వమని మాట్లాడుతున్నారు... మీ ముఖ్యమంత్రే తిన్నది అరక్క రైతులు ధర్నాలు చేస్తున్నారని అన్నారని గుర్తుచేశారు.

Advertisement
Advertisement