భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ

Aqua University in Bhimavaram - Sakshi

భూమిని సేకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశం

వర్సిటీలో ఆక్వా రంగ సంబంధిత కోర్సులు

రైతుల హర్షం     

సాక్షి, అమరావతి: భీమవరంలో ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వర్సిటీ స్థాపనకు అవసరమైన భూమిని సేకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ప్రాథమికంగా వర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన భూమిని సేకరించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 

► రాష్ట్రంలో ఏటా 25.52 లక్షల టన్నుల చేపలు, 11.82 లక్షల టన్నుల రొయ్యల దిగుబడి వస్తోంది. ఇది క్రమంగా పెరుగుతూనే ఉంది. 
► చేపలు, రొయ్యల సాగులో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే ఈ దిగుబడి మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో సాగుకు సంబంధించిన వివిధ కోర్సులను బోధించే యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. 
► ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆక్వా సాగు అధికంగా జరుగుతుండటంతో ఈ జిల్లాల రైతులకు భీమవరం అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్పారు. 
► ఈ జిల్లాల్లోనే శాస్త్రీయ విధానాలను అనుసరించే రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హేచరీస్‌ నిర్వహణ, ఎగుమతి వ్యాపారాల్లో కొనసాగుతున్నవారు అధికంగా ఉన్నారు. వీటన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని భీమవరంలో యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, ఇతర అధికారులను సీఎం ఆదేశించడంతో చర్యలు ఊపందుకున్నాయి. 
► దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తాడే పల్లిగూడెం సమీపంలోని వెంకటరామన్న గూడెంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పింది. 
► ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించడం పట్ల ఆయా జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో భూసేకరణ పూర్తి చేస్తాం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు భీమ వరంలో ఆక్వా యూ నివర్సిటీ ఏర్పాటుకు అవసర మైన భూమిని సేకరించే ప్రయ త్నాలు చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌తో పలుమార్లు భూసేకరణపై చర్చలు జరిపాం. త్వరలోనే భూసేకరణ పూర్తి చేస్తాం.
–కె. కన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top