ఆక్వాకు 'జెల్ల'కొట్టే

Aqua Formers Loss With Gost Fish in West Godavari - Sakshi

జెల్లజాతి దెయ్యం చేపతో నష్టం  

పంట కాలువల్లో పెరుగుతున్న సక్కర్‌

బెంబేలెత్తిపోతున్న రైతులు  

పశ్చిమగోదావరి,పాలకోడేరు: సక్కర్‌ చేప.. వినడానికి వింతగా ఉన్న జెల్ల జాతికి చెందిన ఈ చేప ఆక్వా రైతులను బెంబేలెత్తిస్తోంది. నార్త్‌ అమెరికాలో ఈ చేపను అక్వేరియంలలో పెంచడానికి ఉత్పత్తి చేశారు. ఇది మన ప్రాంతంలోని జలాల్లోకి ఎలా వచ్చిందో ఏమోగానీ పంట కాలువల్లో విపరీతంగా పెరుగుతోంది.  ఆక్వా చెరువులను తుడిచిపెట్టేస్తోంది. దీంతో ఈ చేపను ఆక్వా రైతులు దెయ్యం చేపగాపిలుస్తున్నారు. ఒంటి నిండా మచ్చలతో నెత్తిమీద కళ్లు ఉండే ఈ చేప పంట కాలువల్లో నుంచి ఆక్వా చెరువుల్లోకి వెళ్లి మత్స్య సంపదకు వేసిన మేతను తినేస్తోంది. ఫలితంగా చెరువుల్లో రొయ్యలు, చేపలకు మేత చాలక ఎదుగుదల లోపిస్తోంది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఈ చేప తినేందుకు అనువైనదైనా దీని ఆకారం చూసి ఎవరూ తినడం లేదని అధికారులు చెబుతున్నారు. 

ఆక్వా రంగానికి నష్టం  
సక్కర్‌ చేప హోమ్నివారస్‌ జాతికి చెందింది. దీని శాస్త్రీయ నామం హైపోస్తోమస్‌ క్లిపికోస్తోమస్‌. ఇవి కొండ ప్రాంతాల్లో ఉంటాయి. రూప్‌ చంద్‌ తదితర చేపలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటప్పుడు మనదేశానికి వచ్చి ఉంటుందని చెబుతున్నారు. ఇది మంచినీటితోపాట కలుషిత జలాలు, ఆక్సిజన్‌ తక్కువ శాతం ఉన్న నీటిలోనూ బతికేస్తుంది. చేపలు, రొయ్యల చెరువుల్లోకి వెళితే వాటికి వేసే మేతను తినేయడం వల్ల ఆక్వా రైతుకు అపారనష్టం కలుగుతోంది. ఇది అరకేజి సైజు వరకూ పెరుగుతుంది. అక్వేరియంలో ఫిష్‌గా వాడతారు. నాచు, చిన్న చేపలను ఆహారంగా తీసుకుంటుంది. దీంతో అక్వేరియంలో అద్దాలకు పట్టిన నాచును శుభ్రం చేయడానికి దీనిని పెంచుతారు. – ఎల్‌ఎల్‌ఎన్‌రాజు, ఎఫ్‌డీఓ, వీరవాసరం

బాగా పెరుగుతున్నాయి
ఇటీవల కాలంలో ఈ సక్కర్‌ చేపలు పంటకాలువలు, బోదెల్లోనూ కనపడుతున్నాయి. ఈ చేపలు ఆక్వా చెరువుల్లోకి వచ్చి నష్టం చేస్తున్నాయని అధికారులు తేల్చిచెప్పారు. ఇలాంటి చేపలు చెరువుల్లోకి రాకుండా ముందుగానే చర్యలు తీసుకుని ఆక్వా రంగాన్ని కాపాడాలి.  – కేవీ అప్పారావు, మోగల్లు, ఆక్వా రైతు     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top