‘ఆర్టీసీ’ ఎన్నికల పోరు నేడు

APSRTC Union Elections In Nellore - Sakshi

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఆర్టీసీ యూనియన్ల గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 5 గంటల నుంచే ఎన్నికలు నిర్వహించేందుకు కార్మికశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జోరుగా సాగిన ప్రచారంతో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. రాష్ట్ర నాయకులు డిపోల స్థాయిలో ప్రచారం, బహిరంగ సభలు నిర్వహించి భారీగా హామీలను ఇచ్చారు. ఆర్టీసీలో ఐదు యూనియన్లకు కార్మిక శాఖ గుర్తింపు ఉంది. ఎన్నికల్లో తమ ప్యానల్‌ను గెలిపించేందుకు ఏ యూనియన్‌ సొంతగా ప్రయత్నాలు చేయలేదు.

రాజకీయ పార్టీల అండతో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేశారు. కాగడా గుర్తుపై నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్, బస్సు గుర్తుపై ఎంప్లాయీస్‌ యూనియన్‌ హోరాహోరీగా పోరాడుతున్నాయి. రీజియన్‌ స్థాయిలో ఎన్నికల కమిటీ ప్రధాన అధికారిగా డిప్యూటీ కమిషనర్‌ బి.ఏసుదాసును కార్మిక శాఖ నియమించింది. ఎన్నికల సహాయ అ«ధికారిగా అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ వెంకటనారాయణ వ్యవహరిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.
 
12 పోలింగ్‌ బూత్‌లు 
జిల్లాలోని పది డిపోల్లో ఒక్కొక్కటి చొప్పున, నెల్లూరు ఆర్‌ఎం ఆఫీసులో, పడుగుపాడు వర్క్‌షాపులో ఒకటి వంతున మొత్తం 12 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. నెల్లూరు ఆర్‌ఎం ఆఫీసులో 48 ఓట్లు, ఈడీ ఆఫీసులో (వెంకటాచలం ట్రైనింగ్‌ ఆఫీసు) 52 ఓట్లు, నెల్లూరు డిపో–1లో 638 ఓట్లు, నెల్లూరు డిపో–2లో 532, సూళ్లూరుపేటలో 318, గూడూరు 337, వాకాడు 279 , రాపూరు 311, వెంకటగిరి 319, ఆత్మకూరు 339, ఉదయగిరి 287, కావలి 400, పడుగుపాడు వర్క్‌షాపులో 134, మొత్తం 3,994 మంది ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది.  

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం
ఆర్టీసీ గుర్తింపు యూనియన్ల పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశాం. పోలింగ్‌ అయిన అర్ధగంట తర్వాత కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. రాత్రికల్లా ఫలితాలు వెలువడుతాయి. 
– బి.ఏసుదాసు, ఎన్నికల ప్రధాన అధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top