దోపిడీలో ‘నవయుగం’

APIIC Canceled Land Allotment For Krishnapatnam Infra - Sakshi

కృష్ణపట్నం ఇన్‌ఫ్రా సెజ్‌ భూములు సొంత అవసరాలకు వినియోగం

సెజ్‌ పనులు మొదలు పెట్టకుండా గ్రూప్‌ కంపెనీల పేరిట భూములు తనఖా

4,731.5 ఎకరాల భూమిపై బ్యాంకుల నుంచి రూ.1,935 కోట్ల రుణం

ఏపీఐఐసీ ఎన్‌ఓసీ ఇవ్వకుండానే బ్యాంకుల నుంచి రుణాలు

ఇంకా 6,200 ఎకరాలు కావాలంటూ దరఖాస్తు

నవయుగ సంస్థకు అప్పటి సీఎం చంద్రబాబు అండ

అవకతవకలన్నీ విచారణలో బట్టబయలు

కృష్ణపట్నం ఇన్‌ఫ్రాకు భూమి కేటాయింపులు రద్దు చేసిన ఏపీఐఐసీ

సాక్షి, అమరావతి: కృష్ణపట్నం పోర్టుకు 100 కిలోమీటర్లు, చెన్నై పోర్టుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీసిటీ సెజ్‌ 180కి పైగా దేశ, విదేశీ యూనిట్లను ఆకర్షించడం ద్వారా 36,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. కృష్ణపట్నం పోర్టుకు 75 కిలోమీటర్లు, చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నాయుడుపేట సెజ్‌ 60కి పైగా భారీ యూనిట్లను ఆకర్షించడం ద్వారా 6,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. మరి ఇదే సమయంలో కృష్ణపట్నం పోర్టుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేపీఐఎల్‌) ప్రతిపాదించిన ‘మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌’ ఎన్ని పెట్టుబడులను ఆకర్షించింది, ఎంతమందికి ఉపాధి కల్పించిందో ఊహించగలరా? ప్రభుత్వం నుంచి 4,731.5 ఎకరాల భూమిని తీసుకొని పదేళ్లు దాటింది.

అయినా ఈ సెజ్‌లో ఇప్పటిదాకా పనులే ప్రారంభం కాలేదంటే నమ్మగలరా? సెజ్‌ పేరిట తీసుకున్న భూములను కేఐపీఎల్‌ సంస్థ వేరే కంపెనీల పేరిట బ్యాంకుల్లో తనఖా పెట్టి, రూ.వేల కోట్ల రుణాలు తీసుకుంది. ఇప్పటికే తీసుకున్న భూమిలో కనీసం ఒక్క శాతం కూడా వినియోగించుకోలేకపోయినా ఇంకా 6,000 ఎకరాలు కావాలంటూ దరఖాస్తు చేసుకుందంటే ఈ కంపెనీ భూ దాహాన్ని అర్థం చేసుకోవచ్చు. మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌ పేరిట నవయుగ గ్రూప్‌ విచ్చలవిడిగా సాగించిన భూ దందా ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) విచారణలో బట్టబయలయ్యింది.

ఎకరం కేవలం రూ.1.15 లక్షలకే కేటాయింపు
సుబ్బారావు పేరిట ఉన్న భూములను అప్పారావు బ్యాంకుల్లో తనఖా పెట్టుకొని రుణం పొందడానికి వీలవుతుందా? ఒక కంపెనీ పేరిట ఉన్న భూములను వేరే కంపెనీలు తనఖా పెట్టుకొని రుణం తీసుకోగలవా? ఇది సాధ్యమేనని నిరూపించింది నవయుగ గ్రూపు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌ను ఏర్పాటు చేస్తామంటూ తీసుకున్న భూములను నవయుగ కంపెనీ సొంత అవసరాలకు వినియోగించుకోవడం వివాదాస్పదంగా మారింది.

భారీ సెజ్‌ను ఏర్పాటు చేయడానికి నవయుగ గ్రూపు కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట 2009, 2010లో రెండు విడతలుగా మొత్తం 4,731.5 ఎకరాల భూమిని తీసుకుంది. ఈ భూమిని ఎకరం కేవలం రూ.1.15 లక్షలకే కేఐపీఎల్‌కు ఏపీఐఐసీ విక్రయించింది. ఈ భూములను సెజ్‌ అభివృద్ధి కోసం వినియోగించకుండా నవయుగ సంస్థ సొంత అవసరాలకు వినియోగించుకుంది. ఈ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి, రూ.వేల కోట్ల పొందినట్లు ఏపీఐఐసీ పరిశీలనలో తేలింది. నవయుగ గ్రూపునకు చెందిన మచిలీపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, నవయుగ ఇంజనీరింగ్, కాటలిస్ట్‌ ట్రస్టీషిప్‌ ఇలా అనేక అనుబంధ కంపెనీల పేరిట ఏకంగా రూ.1,935 కోట్ల రుణాలు తీసుకుంది.

భూములను తనఖా పెట్టి రుణం తీసుకోవాలంటే ఏపీఐఐసీ నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఎన్‌వోసీ లేకుండానే పలు బ్యాంకులు నవయుగ సంస్థకు రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చేశాయి. ఒక్క ఐఎఫ్‌సీఐ మాత్రమే ఎన్‌ఓసీ కావాలని పట్టుపట్టడం, ఏపీఐఐసీ ఎన్‌ఓసీ ఇవ్వకపోవడంతో రూ.250 కోట్ల రుణం ఆగిపోయింది. వేరే కంపెనీ పేరిట ఉన్న భూములను తనఖా పెట్టుకొని బ్యాంకులు ఎన్‌వోసీ లేకున్నా ఎలా రుణాలు ఇచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది.

యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
ఏపీఐఐసీతో కుదిరిన ఒప్పందం ప్రకారం భూములు ఇచ్చిన రెండేళ్లలోగా ‘సెజ్‌’ను అందుబాటులోకి తీసుకురావాలి. నాలుగేళ్ల తర్వాత పనులను పరిశీలిస్తే కేవలం 4–5 ఎకరాల పరిధిలో కేవలం మూడు అంతస్తుల అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, ఒక పాఠశాల, తాత్కాలిక క్యాంటీన్‌ను మాత్రమే నిర్మించారు. అంటే తీసుకున్న 4,731.15 ఎకరాల్లో ఒక శాతం భూమిని కూడా వినియోగించుకోలేదు. ఒప్పందం కుదుర్చుకున్న 2008 ఆగస్టు 1న ఉన్న కేపీఐఎల్‌ వాటాదారులు 2013 సెప్టెంబర్‌ 16 మారిపోయారు. నవయుగ గ్రూపే కేఐపీఎల్‌ను ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న విషయం ఫర్పార్మెన్స్‌ ఆడిటింగ్‌లో బయటపడింది. అంతేకాదు కేఐపీఎల్‌ పేరిట తీసుకున్న రుణాలను నవయుగ సొంత అవసరాలకు వాడుకున్న విషయం బహిర్గతమైంది. సెజ్‌ పనులు మొదలు పెట్టకుండానే మరో 6,200 ఎకరాలు కావాలంటూ నవయుగ సంస్థ దరఖాస్తు చేసుకుంది.

రద్దును అడ్డుకుంటూ వచ్చిన బాబు
నవయుగ సంస్థ సెజ్‌ పనులను ప్రారంభించకపోవడంతో భూములు వెనక్కి తీసుకోవడానికి ఏపీఐఐసీ పలుమార్లు నోటీసులు పంపినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటూ వచ్చారు. ఒకసారి ఫైనాన్స్‌ విభాగం కొర్రి వేసి పంపితే దానికి ఏపీఐఐసీ సమాధానం ఇచ్చింది. దానితో ఫైల్‌ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి వద్దకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలతో ఈ ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపించారు.

అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి మరో సందేహం లేవనెత్తి పరిశ్రమల శాఖకు వెనక్కి పంపించారు. ఇలా అప్పటి సీఎం చంద్రబాబు నవయుగకు ఇతోధికంగా సాయం చేశారు. చంద్రబాబు అండతోనే ఈ భూములను నవయుగ సంస్థ తనఖా పెట్టి భారీ ఎత్తున రుణాలు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. సెజ్‌ నిర్మాణం విషయంలో నిబంధనలు ఉల్లఘించడం, పనులు మొదలు పెట్టకపోవడంపై నోటీసులు జారీ చేసినా కేఐపీఎల్‌ స్పందించకపోవడంతో 4,731.5 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఏపీఐఐసీ ఇటీవల నిర్ణయం తీసుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top