breaking news
sri city sez
-
దోపిడీలో ‘నవయుగం’
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం పోర్టుకు 100 కిలోమీటర్లు, చెన్నై పోర్టుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీసిటీ సెజ్ 180కి పైగా దేశ, విదేశీ యూనిట్లను ఆకర్షించడం ద్వారా 36,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. కృష్ణపట్నం పోర్టుకు 75 కిలోమీటర్లు, చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నాయుడుపేట సెజ్ 60కి పైగా భారీ యూనిట్లను ఆకర్షించడం ద్వారా 6,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. మరి ఇదే సమయంలో కృష్ణపట్నం పోర్టుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (కేపీఐఎల్) ప్రతిపాదించిన ‘మల్టీ ప్రొడక్ట్ సెజ్’ ఎన్ని పెట్టుబడులను ఆకర్షించింది, ఎంతమందికి ఉపాధి కల్పించిందో ఊహించగలరా? ప్రభుత్వం నుంచి 4,731.5 ఎకరాల భూమిని తీసుకొని పదేళ్లు దాటింది. అయినా ఈ సెజ్‌లో ఇప్పటిదాకా పనులే ప్రారంభం కాలేదంటే నమ్మగలరా? సెజ్ పేరిట తీసుకున్న భూములను కేఐపీఎల్ సంస్థ వేరే కంపెనీల పేరిట బ్యాంకుల్లో తనఖా పెట్టి, రూ.వేల కోట్ల రుణాలు తీసుకుంది. ఇప్పటికే తీసుకున్న భూమిలో కనీసం ఒక్క శాతం కూడా వినియోగించుకోలేకపోయినా ఇంకా 6,000 ఎకరాలు కావాలంటూ దరఖాస్తు చేసుకుందంటే ఈ కంపెనీ భూ దాహాన్ని అర్థం చేసుకోవచ్చు. మల్టీ ప్రొడక్ట్ సెజ్ పేరిట నవయుగ గ్రూప్ విచ్చలవిడిగా సాగించిన భూ దందా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) విచారణలో బట్టబయలయ్యింది. ఎకరం కేవలం రూ.1.15 లక్షలకే కేటాయింపు సుబ్బారావు పేరిట ఉన్న భూములను అప్పారావు బ్యాంకుల్లో తనఖా పెట్టుకొని రుణం పొందడానికి వీలవుతుందా? ఒక కంపెనీ పేరిట ఉన్న భూములను వేరే కంపెనీలు తనఖా పెట్టుకొని రుణం తీసుకోగలవా? ఇది సాధ్యమేనని నిరూపించింది నవయుగ గ్రూపు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో మల్టీ ప్రొడక్ట్ సెజ్‌ను ఏర్పాటు చేస్తామంటూ తీసుకున్న భూములను నవయుగ కంపెనీ సొంత అవసరాలకు వినియోగించుకోవడం వివాదాస్పదంగా మారింది. భారీ సెజ్‌ను ఏర్పాటు చేయడానికి నవయుగ గ్రూపు కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 2009, 2010లో రెండు విడతలుగా మొత్తం 4,731.5 ఎకరాల భూమిని తీసుకుంది. ఈ భూమిని ఎకరం కేవలం రూ.1.15 లక్షలకే కేఐపీఎల్కు ఏపీఐఐసీ విక్రయించింది. ఈ భూములను సెజ్ అభివృద్ధి కోసం వినియోగించకుండా నవయుగ సంస్థ సొంత అవసరాలకు వినియోగించుకుంది. ఈ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి, రూ.వేల కోట్ల పొందినట్లు ఏపీఐఐసీ పరిశీలనలో తేలింది. నవయుగ గ్రూపునకు చెందిన మచిలీపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, నవయుగ ఇంజనీరింగ్, కాటలిస్ట్ ట్రస్టీషిప్ ఇలా అనేక అనుబంధ కంపెనీల పేరిట ఏకంగా రూ.1,935 కోట్ల రుణాలు తీసుకుంది. భూములను తనఖా పెట్టి రుణం తీసుకోవాలంటే ఏపీఐఐసీ నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఎన్వోసీ లేకుండానే పలు బ్యాంకులు నవయుగ సంస్థకు రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చేశాయి. ఒక్క ఐఎఫ్సీఐ మాత్రమే ఎన్ఓసీ కావాలని పట్టుపట్టడం, ఏపీఐఐసీ ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో రూ.250 కోట్ల రుణం ఆగిపోయింది. వేరే కంపెనీ పేరిట ఉన్న భూములను తనఖా పెట్టుకొని బ్యాంకులు ఎన్వోసీ లేకున్నా ఎలా రుణాలు ఇచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన ఏపీఐఐసీతో కుదిరిన ఒప్పందం ప్రకారం భూములు ఇచ్చిన రెండేళ్లలోగా ‘సెజ్’ను అందుబాటులోకి తీసుకురావాలి. నాలుగేళ్ల తర్వాత పనులను పరిశీలిస్తే కేవలం 4–5 ఎకరాల పరిధిలో కేవలం మూడు అంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఒక పాఠశాల, తాత్కాలిక క్యాంటీన్‌ను మాత్రమే నిర్మించారు. అంటే తీసుకున్న 4,731.15 ఎకరాల్లో ఒక శాతం భూమిని కూడా వినియోగించుకోలేదు. ఒప్పందం కుదుర్చుకున్న 2008 ఆగస్టు 1న ఉన్న కేపీఐఎల్ వాటాదారులు 2013 సెప్టెంబర్ 16 మారిపోయారు. నవయుగ గ్రూపే కేఐపీఎల్‌ను ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న విషయం ఫర్పార్మెన్స్ ఆడిటింగ్‌లో బయటపడింది. అంతేకాదు కేఐపీఎల్ పేరిట తీసుకున్న రుణాలను నవయుగ సొంత అవసరాలకు వాడుకున్న విషయం బహిర్గతమైంది. సెజ్ పనులు మొదలు పెట్టకుండానే మరో 6,200 ఎకరాలు కావాలంటూ నవయుగ సంస్థ దరఖాస్తు చేసుకుంది. రద్దును అడ్డుకుంటూ వచ్చిన బాబు నవయుగ సంస్థ సెజ్ పనులను ప్రారంభించకపోవడంతో భూములు వెనక్కి తీసుకోవడానికి ఏపీఐఐసీ పలుమార్లు నోటీసులు పంపినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటూ వచ్చారు. ఒకసారి ఫైనాన్స్ విభాగం కొర్రి వేసి పంపితే దానికి ఏపీఐఐసీ సమాధానం ఇచ్చింది. దానితో ఫైల్ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి వద్దకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలతో ఈ ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపించారు. అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి మరో సందేహం లేవనెత్తి పరిశ్రమల శాఖకు వెనక్కి పంపించారు. ఇలా అప్పటి సీఎం చంద్రబాబు నవయుగకు ఇతోధికంగా సాయం చేశారు. చంద్రబాబు అండతోనే ఈ భూములను నవయుగ సంస్థ తనఖా పెట్టి భారీ ఎత్తున రుణాలు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. సెజ్ నిర్మాణం విషయంలో నిబంధనలు ఉల్లఘించడం, పనులు మొదలు పెట్టకపోవడంపై నోటీసులు జారీ చేసినా కేఐపీఎల్ స్పందించకపోవడంతో 4,731.5 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఏపీఐఐసీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. -
సీఎం జగన్‌తో పాక్సికన్ ఇండియ ఎండీ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం సచివాలయంలో ఫాక్సికన్ ఇండియా ఎండీ జోష్ ఫాల్గర్ కలిశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలను ముఖ్యమంత్రికి వివరించిన ఫాల్గర్, నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో ఉన్న కంపెనీ ద్వారా దాదాపు 15 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. వారందరికి వృత్తిపరమైన శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు. అదే విధంగా కంపెనీ ఉత్పాదక సామర్థ్యం కూడా పెంచబోతున్నామన్న జోష్ ఫాల్గర్ , ప్రస్తుతం నెలకు 35 లక్షల సెల్ఫోన్లు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఎలక్ట్రానిక్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ హబ్‌గా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాల అనుకూల ప్రాంతమన్న ముఖ్యమంత్రి, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఉత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయడానికి అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే దీని ఉద్దేశమన్న సీఎం జగన్, ఆ దిశలో ఫాక్సికన్ కంపెనీ కూడా ముందుడుగు వేయాలని ఆకాంక్షించారు. -
సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లో ఉద్రిక్తత
తిరుపతి : చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లోని ఓ పరిశ్రమలో కార్మికులు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక ఓ పరిశ్రమలో 40 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలిగించింది. దీంతో కార్మికులు పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు. ముందస్తుగా భారీగా పోలీసులను మెహరించారు. తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. -
శ్రీసిటీలో ఇసుజు మోటార్స్ ట్రక్ బిల్డింగ్ యూనిట్
చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటీ సెజ్‌లో ఇసుజు మోటార్స్ కంపెనీ తరపున ట్రక్ బిల్డింగ్ పరిశ్రమ నెలకొల్పేందుకు ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మసనోరి కటయామా సంసిద్ధత వ్యక్తంచేశారు. చంద్రబాబు ఇసుజు మోటార్స్ సంస్థను సందర్శించారు. ప్రస్తుతం భారతదేశంలో ఇసుజు మోటార్స్ కార్యకలాపాలు అంత గొప్పగా లేకపోయినా మేకిన్ ఆంధ్రప్రదేశ్‌లో తాము భాగస్వాములవుతామని కటయామా ప్రకటించారు. భారతదేశం నుంచి జపనీయులు బుద్ధిజాన్ని స్వీకరిస్తే, జపాన్ నుంచి తాము పని సంస్కృతిని అలవర్చుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మెగా ఫుడ్ పార్కులకు అవసరమైన కోల్డ్ చెయిన్లను రూపొందించేందుకు మయేవక మాన్యుఫాక్చరింగ్ కంపెనీ చైర్మన్ యోషిరో తనాకా ఆసక్తి ప్రదర్శించారు. మయేవక మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ప్రతినిధులతో కూడా ఏపీ ప్రభుత్వ బృందం భేటీ అయ్యింది.