రాష్ట్రంలోని కీలక పోస్టుల భర్తీ అంశంలో మరోసారి రాష్ట్ర, రాష్ట్రేతర అధికారుల సమస్య తెరమీదకు వచ్చింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కీలక పోస్టుల భర్తీ అంశంలో మరోసారి రాష్ట్ర, రాష్ట్రేతర అధికారుల సమస్య తెరమీదకు వచ్చింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌గా రాష్ట్రానికి చెందిన అధికారినే ఎంపిక చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే మూడు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు రాష్ట్రేతర కేడర్‌కు చెందిన అధికారులకే దక్కింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి కూడా రాష్ట్రేతర వ్యక్తికే దక్కింది. ఏపీపీఎస్‌సీ చైర్మన్ పోస్టును కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులకే ఇస్తున్నారంటూ ఇప్పటికే రాష్ట్ర ఐఏఎస్‌లు మండిపడుతున్నారు. ఈ పోస్టింగుల వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు సీఎంతో కూడా సమావేశమయ్యారు. తాజాగా ఏపీఈఆర్‌సీ చైర్మన్ ఎంపిక అంశం తెరపైకి వచ్చింది. ఈఆర్‌సీ చైర్మన్ ఎంపిక కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ.. మంగళవారం (3వ తేదీ) సమావేశం కానుంది.
ఈ పోస్టు కోసం పలువురు సీనియర్ ఐఏఎస్‌లతో పాటు ఇటీవలి వరకూ ఈఆర్‌సీ ఇన్‌చార్జి చైర్మన్‌గా ఉన్న శేఖర్‌రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. కానీ, రేసులో ప్రధానంగా ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.సాహూ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి భాస్కర్ ఉన్నారు. ఇందులో సాహూ ఒడిశాకు చెందినవారు. భాస్కర్ కర్ణాటకకు చెందిన అధికారి. అయితే, రాష్ట్రంలోని ప్రధాన పోస్టులన్నీ రాష్ట్రేతర అధికారులకే ఇస్తున్న నేపథ్యంలో.. ఈఆర్‌సీ చైర్మన్ పోస్టును రాష్ట్రానికి చెందిన అధికారులకే ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు ఈఆర్‌సీ సభ్యుడి (ఫైనాన్స్) ఎంపిక కోసం కూడా ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం ఒకే సభ్యుడు ఉండడంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.