విజయవాడలో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్


 సాక్షి, విజయవాడ : విజయవాడలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎట్టకేలకు ఈ ఆస్పత్రి విషయంపై స్పష్టత ఇచ్చారు. నూతన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఈ క్రమంలో మళ్లీ సూపర్‌స్పెషాలిటీ వ్యవహారం తెరపైకి వచ్చింది. అధికార పార్టీ స్థానిక నేతలు కూడా ఎన్నికల సమయంలో నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పిం చారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయవాడలోనే ఈ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం ప్రకటించారు. ఈ హాస్పిటల్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉంటుందని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తారు.

 

 విజయవాడలో సాధారణ ప్రభుత్వ వైద్యశాల ఉంది. అయితే ఈ వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఎక్కువ లేవు. దీంతో వైద్యశాలకు వచ్చే రోగుల సంఖ్య తక్కువగా ఉంటోంది. ప్రభత్వ వైద్యశాలలో 790 పడకలు, ఐదు సూపర్ స్పెషాలిటీ విభాగాలు, మరో 15 వరకూ సాధారణ విభాగాలు ఉన్నాయి. రోజుకు సగటున 1500 మంది అవుట్‌పేషెంట్లు వైద్యశాలకు వస్తున్నారు. 700 మంది ఇన్ పేషెంట్‌లు నిత్యం ఆస్పత్రిలో ఉండి చికిత్సపొందుతున్నారు. ప్రధానంగా కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి సూపర్‌స్పెషాలిటీ విభాగాలు ఉన్నప్పటికీ మెరుగైన వైద్యసేవలు ఇక్కడ లభించక ఎక్కువ మంది రోగులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తే పేదలకు అధునాతన వైద్యం ఉచితంగా లభిస్తుంది.

 

 విజయవాడలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని 2010లో  అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మారడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విషయం మరుగున పడింది. ప్రసుత్తం మంత్రి కామినేని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టుకు పాత ప్రాజెక్టుకు పొంతన లేదు. ఇది పూర్తిగా 90 శాతం కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మించే ప్రాజెక్టు. ప్రసుత్తం ఉన్న హాస్పిటల్ సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రభుత్వ వైద్యశాల, మెడికల్ కాలేజీ రెండు పక్కపక్కనే ఉన్నాయి. అయితే మెడికల్ కళాశాల ప్రాంగణంలో సుమారు 30 ఎకరాల ఖాళీ స్థలం ఉంది.

 

 ఈ నేపథ్యంలో ఈ రెండింటికీ అనుబంధంగా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి భవనాలు నిర్మించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూపర్‌స్పెషాలిటీ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. సుమారు రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.135 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.15 కోట్లతో ఆస్పత్రి నిర్మిస్తారు. దీంతో మరో 15 వరకు సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. మరో రెండు నెలల్లో ఇది కార్యరూపం దాల్చేఅవకాశం ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top