ఎమ్మెల్యేలు@ఢిల్లీ

Ap Special Status My Family Members All In Initiation Ysrcp Leaders - Sakshi

పార్టీ కీలక నేతలంతా హస్తినలోనే  దీక్షా శిబిరంలోనే పెద్దిరెడ్డి కుటుంబం n ఆరోగ్యం క్షీణిస్తున్నా పట్టువదలని మిథున్‌రెడ్డి  n ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష కొనసాగింపు 

ఐదు కోట్ల ఆంధ్రుల కోసం...విభజన హక్కుల సాధన కోసం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం.. ప్రాణాలను పణంగా పెట్టి హస్తినలో ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న ఎంపీలకు సర్వత్రా మద్దతు వెల్లువెత్తుతోంది. జిల్లాకు చెందిన పార్టీ శాసనసభ్యులూ, సమన్వయకర్తలు, వివిధ విభాగాల్లో పార్టీకి సేవలందించే నాయకులంతా మూడు రోజుల ముందే ఢిల్లీ చేరుకున్నారు. ఎంపీలు దీక్ష చేస్తోన్న శిబిరానికి వెళ్లి సంఘీభావం ప్రకటించి హోదా సాధనలో భాగస్వాములవుతున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే..చిత్తూరు జిల్లా నేతలే ఢిల్లీలో కీలకంగా మారి ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, తిరుపతి : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీ ఎంపీలందరూ ఈ నెల 6న పదవులకు రాజీనామాలు చేసి ఏపీ భవన్‌లో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. రోజులు గడుస్తున్నా, దీక్షకు కూర్చున్న వారి ఆరోగ్యం క్షీణిస్తున్నా కేంద్రం నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో ప్రాణాలైనా అర్పిస్తాం, ఉద్యమాన్ని వీడబోమన్న ఎంపీల పిలుపునకు వివిధ జిల్లాల నాయకులందరూ కదిలారు. హస్తిన బాట పట్టి దీక్షా శిబిరాన్ని చేరుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నేతలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏపీ శాసనసభలో ఉప నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు సారథ్యం వహించారు.

డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కళత్తూరు నారాయణస్వామి, డాక్టర్‌ సునీల్‌ కుమార్, చింతల రామచంద్రా రెడ్డి, దేశాయ్‌ తిప్పారెడ్డి, ఆర్‌కే రోజాలతో పాటు సమన్వయకర్తలు జంగాలపల్లి శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి తదితరులంతా దీక్షా శిబిరానికి చేరుకుని ఎంపీలకు సంఘీభావం ప్రకటించారు. హోదా నినాదంలో గొంతు కలిపారు. రాష్ట్రం తరపున నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. దీక్షలు సంపూర్ణంగా ముగిసే వరకూ ఢిల్లీలోనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. 
కుటుంబమంతా దీక్షా శిబిరంలోనే..
ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తోన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. వైద్యులు రెండు పూటలా పరీక్షలు నిర్వహించి జాగ్రత్తలు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందిన మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణమ్మ, భార్య దివ్య, సోదరి శ్రీశక్తిలు రెండు రోజులుగా దీక్షా ప్రాంగణాన్ని వీడటం లేదు. దగ్గరుండి మిథున్‌ రెడ్డికి మద్దతు ప్రకటించి ధైర్యం చెబుతున్నారు. దీక్ష విరమించమని పలువురు మిత్రులు, పార్టీ పెద్దలు చెప్పినా మిథున్‌ రెడ్డి పట్టువీడటం లేదు. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళ్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు. 

కాపునాడు నేతల సంఘీభావం..
రాయలసీమ కాపునాడు నేతలు పలువురు మంగళవారం ఢిల్లీ వెళ్లి ఎంపీ మిథున్‌రెడ్డి దీక్షకు మద్దతు ప్రకటించారు. చిత్తూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు వీరికి నేతృత్వం వహించారు. జింకా వెంకటాచలపతి, మిద్దింటి కిషోర్, కొండవీటి నాగభూషణం, కోలా సోము, పీటీఎం శివన్న, సోంపాలెం జయచంద్ర తదితరులు మద్దతు ప్రకటించిన వారిలో ఉన్నారు. అదేవిధంగా తిరుపతికి చెందిన రాయలసీమ విద్యాసంస్థల డైరెక్టర్‌ వై. ఆనందరెడ్డి, సదుం రవీంద్రనాథ్‌లు కూడా ఢిల్లీ వెళ్లి ఎంపీ మిథున్‌ రెడ్డికి సంఘీభావాన్ని ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top