ఏపీ పోలీస్‌ హౌసింగ్‌.. సరికొత్త రికార్డు | AP Police Housing Corporation Creates New Record | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీస్‌ హౌసింగ్‌.. సరికొత్త రికార్డు

Sep 23 2019 7:04 AM | Updated on Sep 23 2019 7:41 AM

AP Police Housing Corporation Creates New Record - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లు, పోలీసుల క్వార్టర్లు నిర్మించడానికి 40 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈ సంస్థ ఏడాదికి గరిష్టంగా రూ.250 కోట్ల విలువైన భవన నిర్మాణ పనులు మాత్రమే చేసేది. అలాంటిది ప్రస్తుత ఏడాదిలో ఏకంగా రూ.1,750 కోట్ల విలువైన నిర్మాణ పనులు చేపట్టే స్థాయికి చేరడం విశేషం. కార్పొరేషన్‌ పనితీరు నచ్చిన వివిధ ప్రభుత్వ శాఖలు కూడా తమ భవన నిర్మాణాల బాధ్యతలను దానికే అప్పగిస్తుండటం గమనార్హం. 

సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 25 పోలీస్‌స్టేషన్లను ఆధునిక వసతులతో, అతి తక్కువ సమయంలో నిర్మించి రికార్డు సృష్టించిన ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నెల్లూరు, కాకినాడలో జిల్లా పోలీస్‌ కార్యాలయాలను నిర్మించి మరో ఘనతను సాధించింది. అదేవిధంగా విశాఖపట్నంలో గ్రేహౌండ్స్‌ ప్రధాన కార్యాలయ భవనాలను కూడా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్మించింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతం తుళ్లూరులో రూ.45.40 కోట్లతో ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగానికి పరిపాలన భవనంతోపాటు ఇతర మౌలిక భవనాలను నిర్మిస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ, పశు సంవర్థక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, శ్రీ పద్మావతి మహిళా, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ, శ్రీ వేంకటేశ్వర, ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయాలతోపాటు అనేక సంస్థలు పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ సేవలను వినియోగించుకోవడం గమనార్హం. 

నిర్మాణాల్లో ఆధునిక పద్ధతులు
నిర్మాణ రంగంలో పోటీని తట్టుకునేందుకు కార్పొరేషన్‌ వినూత్న ఆవిష్కరణలు చేపట్టింది. నిర్మాణ రంగంలో ఎక్కువ సమయం వృథా అయ్యే దశలను గుర్తించి ‘డ్యాష్‌ బోర్డ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌’ను ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ సులువవడంతోపాటు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవచ్చు. రియల్‌టైమ్‌ మానిటరింగ్, ఈజీ ప్లానింగ్, కచ్చితమైన ప్రాజెక్ట్‌ ట్రాకింగ్, సమర్థవంతంగా బడ్జెట్‌ కంట్రోల్, రిస్క్‌ ఎనాలిసిస్, పారదర్శకతకు ఇది దోహదపడుతుంది. ఆధునిక సాంకేతిక పద్ధతులను నిర్మాణాల్లో ఉపయోగించేందుకు పరిశోధన అభివృద్ధి విభాగాన్ని, మరిన్ని నిర్మాణ పనులు దక్కించుకుని లాభాలు ఆర్జించేందుకు మార్కెటింగ్‌ సెల్‌ను కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. అదేవిధంగా కార్పొరేషన్‌లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు నైపుణ్యాలు మెరుగుపడేలా ఎప్పటికప్పుడు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట
ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి కూడా కార్పొరేషన్‌ ప్రాధాన్యత ఇస్తోంది. ఉద్యోగుల పెన్షన్‌ స్కీమ్‌ టాప్‌ అప్‌ నిమిత్తం 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.5.27 కోట్ల ఎల్‌ఐసీ బకాయిలను తాజాగా చెల్లించింది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల అంశాన్ని కూడా పరిష్కరించింది. పది మంది ఏఈ, ఏఈఈలకు డీఈఈలుగా, ఒక డీఈకి ఈఈగా, ముగ్గురు సూపరింటెండెంట్లను ఏవోలుగా, పది మంది సీనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అకౌంటెంట్‌లకు సూపరింటెండెంట్లుగా, జూనియర్‌ అసిస్టెంట్‌లను సీనియర్‌ అసిస్టెంట్‌లుగా ఇటీవల పదోన్నతులు కల్పించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో సమానంగా పెంచడంతోపాటు బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఏ ఇతర హౌసింగ్‌ కార్పొరేషన్‌ కూడా ఈ తరహా పథకాన్ని ప్రవేశపెట్టకపోవడం గమనార్హం. 

సమష్టి కృషితోనే రికార్డు 
నేను బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే సమష్టి కృషితో రికార్డును సాధించడం ఆనందంగా ఉంది. తక్కువ వ్యయం, నాణ్యతతోపాటు నిర్ణీత సమయానికి నిర్మాణాలు పూర్తి చేయడంతో కార్పొరేషన్‌కు ఇతర శాఖల నిర్మాణ పనులు కూడా దక్కుతున్నాయి. వ్యాపారాభివృద్ధికి మాత్రమే కాకుండా సంస్థలో పనిచేస్తున్న అందరి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. 
– పీవీ సునీల్‌ కుమార్, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ, వైస్‌ చైర్మన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement