విదేశాల నుంచి వచ్చిన వారికి జియోఫెన్సింగ్‌ 

AP Police Are Following New Procedures With Geotagging - Sakshi

హౌస్‌ క్వారంటైన్‌ యాప్‌ను రూపొందించిన ఏపీ పోలీస్‌ శాఖ

ఒక్క రోజులోనే ఐదు వేల మంది డౌన్‌లోడ్‌

మరో 24 గంటల్లో మరో 20 వేల మంది యాప్‌ పరిధిలోకి..

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిరంతర నిఘా పెట్టనున్న పోలీసులు

సాక్షి, అమరావతి: విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని ఇంటిలో, ప్రభుత్వ క్వారంటైన్‌లో కట్టడి చేయడం క్లిష్టంగా మారిన తరుణంలో రాష్ట్ర పోలీసులు సరికొత్త విధానాలను అనుసరిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులను వారి వివరాలతో జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయడం ద్వారా నియంత్రించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు సాంకేతిక నిపుణులైన పోలీసుల అధికారుల బందం హౌస్‌ క్వారంటైన్‌ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను శుక్రవారం ఒక్క రోజే క్వారంటైన్‌లో ఉన్న ఐదు వేల మంది ఇన్‌స్టాల్‌ చేసుకోవడం విశేషం. 

- వాస్తవానికి.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కలవరం మొదలైన నాటి నుంచి దాదాపు 28 వేల మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరిలో 20 వేల మందిని రానున్న 24 గంటల్లో యాప్‌ పరిధిలోకి తెస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలోనూ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన ఏపీ పోలీసులు దేశానికి మరోసారి ఆదర్శంగా నిలుస్తున్నారు.
- హౌస్‌ క్వారంటైన్‌ యాప్‌లో వివరాలు నమోదు చేస్తే జియోఫెన్సింగ్‌ అనుసంధానమై ఉంటుంది.
- హౌస్‌ క్వారంటైన్‌లో ఉంటున్న వారందరూ ఈ యాప్‌లో మొబైల్‌ నంబర్, ఆరోగ్యపరమైన వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరుస్తారు. దీంతో ఈ యాప్‌ ద్వారా వారిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుంది.
- కోవిడ్‌ బాధితుల కదలికలతోపాటు అవసరమైన వైద్య సేవలు, స్వీయ నియంత్రణకు సూచనలు పోలీసుల పర్యవేక్షణలో జరుగుతాయి.
- కోవిడ్‌ బాధితులు ఇంటి నుంచి 50 మీటర్లు దాటి బయటకు వస్తే తక్షణమే పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం వెళ్లిపోతుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే విధంగా పోలీస్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.

లక్ష్మణ రేఖలా పనిచేస్తుంది
డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఓవెపు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూనే మరోవైపు వైరస్‌ విస్తరించ కుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఈ వైరస్‌ ఇతరులకు వేగంగా విస్తరించే ప్రమాదం ఉండటంతో వారిపై మరింత నిఘా పెట్టాం. అందుకే హౌస్‌ క్వారంటైన్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. జియోఫెన్సింగ్‌తో వారి కదలికలపై నిఘా ఉంచేందుకు ఇది నిజంగా లక్ష్మణ రేఖలా ఉపయోగపడుతుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top