27 మంది ఖైదీలకు ఎయిడ్సా?

AP High Court Seeks Report On AIDS Prisoners - Sakshi

పూర్తి వివరాలను మా ముందుంచండి

ఏపీ హైకోర్టు 

సాక్షి, అమరావతి: రాజమండ్రి కేంద్ర కారాగారంలో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకున్న హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. జైల్లోకి రాకముందే ఈ ఖైదీలకు ఎయిడ్స్‌ ఉందా? జైల్లోకి వచ్చాక ఎయిడ్స్‌ బారిన పడ్డారా? అనే విషయాలపై పూర్తి వివరాలను తమ ముందుం చాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వీరందరికీ అన్ని వైద్య పరీక్షలు చేయించాలని తేల్చిచెప్పింది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి ఏమిటో కూడా తమకు తెలియచేయాలంది.

ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని, దీన్ని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 2కి వాయిదా వేసింది. ఆ రోజున పూర్తి వివరాలతో తమ ముందు హాజరు కావాలని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు 2018లో జీవిత ఖైదును విధించింది. దీన్ని సవాలు చేస్తూ ఆ వ్యక్తి 2019లో హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. తాను ఎయిడ్స్‌తో బాధపడుతున్నానని, అందువల్ల తనకు బెయిల్‌ మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్‌ వేశారు.

ఇందులో భాగంగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ.. రాజమండ్రి జైలులో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నారని కోర్టుకు నివేదించారు. అసలు జైల్లో ఎంత మంది ఖైదీలు ఉంటారని ధర్మాసనం ఆరా తీసింది. 1500 మంది వరకు ఉండొచ్చునని పీపీ చెప్పగా, ఇంతమంది ఎయిడ్స్‌తో బాధపడుతుంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. జైల్లోకి వచ్చే ముందు ఖైదీలకు తప్పనిసరిగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని గుర్తు చేసింది.

ఇందుకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాది బాలస్వామికి స్పష్టం చేసింది. ఆ ఖైదీలను మిగిలిన వారి నుంచి వేరు చేస్తామని చెప్పగా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది నేరమని, వారి పట్ల అది వివక్ష చూపడమే అవుతుందని తెలిపింది. అసలు వారికి వ్యాధి ఎలా సోకిందని ప్రశ్నించింది. జైల్లోకి వచ్చాక వీరు ఎయిడ్స్‌ బారిన పడ్డారని తెలిస్తే జైలు సూపరింటెండెంట్‌పై చర్యలు తప్పవని హెచ్చరించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top